డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తనని మోసం ... నిందితుడి అరెస్ట్

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తనని మోసం ... నిందితుడి అరెస్ట్

ఉప్పల్, వెలుగు: డబుల్ ​బెడ్రూం ​ఇండ్లు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన గుడిదేవుని శశిAకాంత్ గౌడ్ (38) ఉపాధి కోసం సిటీకి వచ్చి పీర్జాదిగూడలో ఉంటున్నాడు.  ఈజీ మనీ కోసం మోసాలకు స్కెచ్ వేశాడు. ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు కావాలంటే ఇప్పిస్తానని  రామంతాపూర్​లో ఉండే తన ఫ్రెండ్ వెంకటేశ్ కు చెప్పాడు. వెంకటేశ్ ఈ విషయాన్ని  తన పక్కింట్లో ఉండే బబ్బురాళ్ల మాధవి అనే మహిళకు చెప్పాడు. ఆమె శశికాంత్​ను కలిసి తనకు పీర్జాదిగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని అడిగింది. 

ఇందుకోసం మాధవి దగ్గరి నుంచి రూ. లక్ష, ఆమె చెల్లెలు అంజలి నుంచి రూ.90 వేలు, ఆమె బంధువు నుంచి రూ.15 వేలు, ఫ్రెండ్ రజియా నుంచి రూ.80 వేలను శశికాంత్ వసూలు చేశాడు. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చినట్లు ఫేక్ అలాట్​మెంట్ లెటర్లు ఇచ్చాడు. అయితే, మూడు నెలల తర్వాత వచ్చిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో బాధితులు హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులను సంప్రదించగా.. అవి ఫేక్ లెటర్లు అని తేలింది. బాధితులు శశికాంత్​కు ఫోన్ చేయగా అతడు రెస్పాండ్ కాలేదు. రెండేండ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.  దీంతో మాధవి ఉప్పల్ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు శనివారం శశికాంత్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్​కు తరలించారు.