- మయన్మార్‌లో చైనీయులతో కలిసి సైబర్ క్రైమ్‌లు
- వరంగల్‌లో యుగ పేరుతో ఫేక్ కన్సల్టెన్సీ
- ఏజెంట్లను అరెస్ట్ చేసిన టీజీసీఎస్‌బీ
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్న ఐదుగు రు ఏజెంట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓవర్సీస్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతను ట్రాప్ చేస్తున్న వీరిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బుధవారం అరెస్ట్ చేసింది.
నిందితులను వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూ డెంకు చెందిన వాసం గోవర్ధన్(35), వరంగల్ రూరల్ సోమారం గోరుగుట్ట తండాకు చెందిన బానోతు మదన్‌లాల్(20), మైసూరుకు చెందిన సయ్యద్ మహ్మద్ మదానీ అలియాస్ మ్యాక్స్ (21), కృష్ణ జిల్లా గన్నవరంకు చెందిన సుగ్గన సుధీర్ కుమార్ (26) తిరుపతికి చెందిన గంగుల నవీన్ (26)గా గుర్తించింది. వీరిని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఈ మేరకు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ట్రాప్ చేసారిలా..
డేటా ఎంట్రీ జాబ్ పేరుతో నిరుద్యోగులను ట్రాప్ చేయా లని మదన్‌లాల్ తన స్నేహితుడైన వాసం గోవర్ధన్‌కు చెప్పాడు. వచ్చిన కమీషన్‌ను పంచుకునేలా డీల్ కుదు ర్చుకున్నాడు. గోవర్ధన్ వరంగల్ కేంద్రంగా లైసెన్స్ తీసుకోకుండా, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా యుగ పేరుతో కన్సల్టెన్సీ పెట్టాడు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులను ట్రాప్ చేసేవాడు. చరణ్, షేక్ అహ్మద్ పాషా అనే వ్యక్తులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘లవ్ కె’ అనే వ్యక్తితో ఇంటర్వ్యూ ఇప్పించాడు.
సెలెక్ట్ అయ్యారని నమ్మించి వారి వద్ద రూ.25 వేలు చొప్పున వసూలు చేశాడు. మదన్‌లాల్, సుధీర్ ప్లాన్‌లో భాగంగా ఫ్లైట్ టికెట్లు సహా బ్యాంకాక్ చేరుకున్న తర్వాత టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేసి, టాక్సీలో మయన్మార్‌లోని మయావాడిలో గల కేకే4 ఏరియాకు తరలించారు.
చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న సైబర్ క్యాంపుల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ, రొమాన్స్ ఫ్రాడ్స్ వంటి నేరాలు చేయించేవారు. తిరిగి వెళ్లాలంటే 5వేల డాలర్లు చెల్లించాలని బెదిరించేవారు. మయన్మార్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధితులను స్వస్థలాలకు చేరుస్తున్నది.
ఇలా ఇప్పటికే హైదరాబాద్‌కు చేరిన 45 మంది బాధితుల ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేశారు. డీఎస్పీ ప్రసాద్‌తో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సోదాలు నిర్వహించింది. ఇండియాకు వచ్చిన వారిలో మదన్‌లాల్, సుధీర్ కుమార్, మదానీ మ్యాక్స్, నవీన్ కూడా ఉన్నట్లు గుర్తించింది. మదన్‌లాల్, గోవర్ధన్ సహా ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేసింది.
