విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం..నిజామాబాద్లో పెరుగుతున్న బాధితులు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం..నిజామాబాద్లో పెరుగుతున్న బాధితులు
  • సబ్​ఏజెంట్ల ద్వారా కోట్లల్లో వసూళ్లు
  • ఇజ్రాయెల్​లో జాబ్స్​ అంటూ రూ.లక్షల్లో టోకరా
  • అప్పులు తీర్చలేక బాధితుల పరేషాన్

నిజామాబాద్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలతో రూ.లక్షలు సంపాదించొచ్చనే ఆశచూపి డబ్బులు ఎగేసుకెళ్తున్న ఘటనలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏజెంట్లు, సబ్​ఏజెంట్లుగా చలామణి అవుతున్నవారు అమాయకులను మాటల్లో దింపి, అప్పులపాలు చేస్తున్నారు. దుబాయ్, ఇజ్రాయెల్​ దేశాల్లో కొలువుల ఆశతో నష్టపోయిన బాధితులు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. తమ సొమ్ము వాపస్​ ఇవ్వాలని ఏజెంట్లను అడిగితే ఉల్టా వార్నింగులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

నిరక్షరాస్యులే లక్ష్యంగా..

ఇజ్రాయెల్​లో జాబ్స్​ఇప్పిస్తానంటూ ఆ దేశంలో ఉంటున్న జిల్లావాసి స్థానికంగా ఇద్దరు సబ్​ఏజెంట్లను నియమించుకొని దందా నడుపుతున్నాడు. నెలకు రూ.లక్ష జీతంతో డ్రైవర్, ప్లంబర్, వాచ్​మెన్, ఎలక్ట్రీషియన్, పెయింటర్​ ఉద్యోగాలు ఉన్నాయని 80 మంది నుంచి తల రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల చొప్పున వసూలు చేయించాడు. ఇలా సుమారు రూ.5 కోట్ల వరకు రాబట్టి చేతులెత్తేశాడు.

దుబాయ్​లో నెల రోజులుంటే జాబ్​ వీసాకు కంపెనీ స్టాంపింగ్​అవుతుందని నమ్మించి మరీ దుబాయ్​ దాకా రప్పించాడు. తీరా వెళ్లాక మోసపోయామని తెలుసుకున్న బాధితులు నాలుగు నెలల కింద వాపస్​ వచ్చారు. డబ్బులు రిటర్న్​చేయమని నందిపేట, ఆర్మూర్​ సబ్ ​ఏజెంట్లను ప్రశ్నించగా తమ వద్ద డబ్బులు లేవని, ఏజెంట్​కే ఇచ్చేశామని ఆన్సర్​ చెప్పారు. దీంతో జాబ్​ఆశతో అప్పులు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. నిరక్షరాస్యులు లేక చిన్నపాటి చదువులు ఉన్న వారినే ట్రాప్​ చేశారు.

ఫోన్​ నెంబర్ ​రిజిస్టర్ ​అయితే చాలు..

బయటి దేశాల్లో కొలువు చేయడానికి ఎక్కడైనా ఫోన్​నెంబర్​ రిజిస్ట్రర్​ చేయిస్తే చాలు రకరకాల లింకులు పంపుతూ, ఫోన్లు చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ నమ్మిస్తున్నారు. వీడియోలు పంపి జాబ్​ సాధించడం సులువనే భావన పెంచుతున్నారు. పాస్​పోర్టులపై వీసా స్టాంపింగ్ ​చేయని దేశాల వివరాలతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి.

నకిలీ ఏజెంట్ల సమాచారం ఇవ్వండి

విదేశీ జాబ్స్​ పేరుతో మోసం చేస్తున్న వారి వివరాలను బాధితులు తెలపాలని సీపీ​కల్మేశ్వర్​ఈ నెల 7న మీడియా ప్రకటన విడుదల చేశారు. సమాచారం ఇచ్చేనవారి పేర్లు సీక్రెట్​గా పెడతామన్నారు. కొలువులు, వీసా, పాస్​పోర్ట్​, టూరిస్టు సేవలు కల్పిస్తామని లైసెన్స్​లేని వ్యక్తులు ఆయా సంస్థల పేరుతో మోసం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏజెంట్లకు ఆఫీసుల కోసం మడిగెలు, నివాసానికి ఇండ్లు  అద్దెకిచ్చే వారు దగ్గర్లోని పోలీస్​స్టేషన్​లకు వెళ్లి అనుమతులు
 తీసుకోవాలన్నారు.

పబ్లిసిటీతో బురిడీ..

విదేశాల్లో రూ.లక్షల జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముమ్మరంగా పబ్లిసిటీ నిర్వహించి, నమ్మి వచ్చిన వారిని బోల్తా కొట్టిస్తున్నారు. నిజామాబాద్ ​సిటీలోని వర్ని చౌరస్తాలో ఉండే ఓ ఏజెంట్​ కెనడాలో కొలువుల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి బాధితులను ఏండ్ల తరబడి వెంట తిప్పించుకుంటున్నాడు. రూరల్ మండలంలో సర్పంచ్​గా పనిచేసిన గిరిజన మహిళ భర్తను సబ్​ఏజెంట్​గా పెట్టుకొని నగదు వసూలు చేశాడు.

బోగస్​వీసాను నమ్మి సొమ్ము చేతిలో పెట్టిన బాధితులు నెత్తికొట్టుకుంటున్నారు. సదరు ఏజెంట్ ​తన రక్షణ కోసం ఇద్దరు పహిల్వాన్​లను మెయింటేన్ ​చేస్తున్నాడు. బాధితులు స్వరం పెంచి మాట్లాడితే పోలీస్​ స్టేషన్​ వెళ్లమని సలహా ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో? ఎవరికి న్యాయం అడగాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. గవర్నమెంట్​ ఆఫీసర్లతో వేదికలు ఏర్పాటు చేయించి కొన్ని కంపెనీలు వసూళ్లకు దిగుతున్నాయి.

ఇజ్రాయెల్​లో బిల్డింగ్​ కన్​స్ర్టక్షన్​ రంగంలో జాబ్స్​అంటూ జనవరి 9న సిటీలోని శివాజీ నగర్​ ఐటీఐ కాలేజీ క్యాంపస్​లో మేళా నిర్వహించారు. మేళాకు 450 మంది అటెండ్​ కాగా, డాక్యుమెంట్​ ఖర్చులంటూ కొందరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేశారు..