ఐబీఎంలో బ్యాక్ డోర్ జాబ్స్ ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్

ఐబీఎంలో బ్యాక్ డోర్ జాబ్స్ ఫ్రాడ్..  నిందితుడి అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో బ్యాక్ డోర్ జాబ్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్​క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్​ఘాట్​లోని శ్రీరమణ కాలనీకి చెందిన కె. ప్రణయ్ కుమార్(29) వెబ్ డిజైనర్​గా, ర్యాపిడో, స్విగ్గీ డెలివరీ బాయ్​గా పనిచేశాడు. జీతం సరిపోకపోవడంతో జాబ్​ల పేరుతో చీటింగ్​కు స్కెచ్ వేశాడు. సైబరాబాద్​లో ఉండే సుకేతన్ గతేడాది జూన్ నుంచి ఐటీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు.

జూన్ 25న వాట్సాప్ ద్వారా సుకేతన్​కు ప్రణయ్ పరిచయమయ్యాడు. లండన్​లోని ఐబీఎం కంపెనీలో ఐటీ జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. వివిధ చార్జీల పేరుతో సుకేతన్ నుంచి రూ.3 లక్షల 36 వేల 500 వసూలు చేశాడు. ఆ తర్వాత సుకేతన్ కాల్స్​కు ప్రణయ్ రెస్పాండ్ ఇవ్వడం మానేశాడు.మోసపోయినట్లు గుర్తించిన సుకేతన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..  ప్రణయ్​ బ్యాంక్ అకౌంట్లు, సెల్​ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని కర్మన్ ​ఘాట్​లో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రణయ్​పై గతంలోనూ ఓ జాబ్ ఫ్రాడ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.