ధరూర్ మండలంలో సగం ధరకే వాహనాలు ఇప్పిస్తానని మోసం.. కోటిన్నరకు పైగా వసూలు

ధరూర్ మండలంలో  సగం ధరకే వాహనాలు ఇప్పిస్తానని మోసం.. కోటిన్నరకు పైగా వసూలు

గద్వాల, వెలుగు: రూ.10 వేలు కడితే 20 వేలు, రూ.50 వేలు కడితే లక్ష, సగం ధరకే ట్రాక్టర్, బైక్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడు, ర్యాలంపాడు, గద్వాల మండలం గోనుపాడు, గట్టు మండలంలోని పలు గ్రామాలకు చెందిన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డాడు. 

బాధితుల వివరాల ప్రకారం.. గద్వాల మండలం గోనుపాడు, ధరూర్ మండలం మార్లబీడు గ్రామాల్లో చర్చి పాస్టర్‌‌‌‌గా పనిచేస్తున్న వసంత్.. ఓ సంస్థతో తనకు ఒప్పందం ఉందని చెప్పుకున్నాడు. సగం డబ్బులు కడితే ట్రాక్టర్ ఇప్పిస్తానని, రూ.10 వేలు కడితే ఆరు నెలల్లో రూ.20 వేలు ఇస్తానని నమ్మించాడు. ఆయన మాటలు నమ్మిన పలువురు పాస్టర్లు, గ్రామస్తులు డబ్బులు చెల్లించారు. 

ఇలా రూ.కోటిన్నర పైగా వసూలు  చేశాడు. నెలలు గడుస్తున్నా హామీ మేరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. ఈ క్రమంలో పాస్టర్ గద్వాల నుంచి పరారయ్యాడు. ఇటీవల ఆయన మళ్లీ గద్వాలకు రావడంతో డబ్బులు ఇవ్వాలని కోరినా స్పందించలేదు. దీంతో రూరల్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో బాధితులు గతంలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ శనివారం మరోసారి గద్వాల సీఐకి కంప్లైంట్ చేశారు.