- రాష్ట్రంలో క్యాన్సర్, పక్షవాతం బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్
- ఇంటి వద్దే ఇంజెక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియోథెరపీ
- కండిషన్ సీరియస్‌గా ఉంటే అంబులెన్స్‌లో తరలింపు
- ఈ ఏడాది 33 జిల్లాల్లో 31 వేల మందికి ఇంటివద్దే అందిన చికిత్స
హైదరాబాద్, వెలుగు: మెట్లుకూడా ఎక్కలేని దీన స్థితిలో ఉన్న పేషంట్ల కోసం ప్రభుత్వం ఇంటిదగ్గరికే పాలియేటివ్ కేర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయినోళ్లు, క్యాన్సర్ ముదిరి పుండ్లు అయినోళ్లు, మంచానికే పరిమితమైన వృద్ధుల కోసం డాక్టర్లు, నర్సుల టీమ్ నేరుగా ఇండ్లకే వస్తున్నది. ప్రైవేట్ డాక్టర్లను పిలిస్తే విజిట్‌కు వేలకు వేలు గుంజుతుండగా.. ప్రభుత్వం మాత్రం మందులు, ఇంజెక్షన్లతోసహా అంతా ఫ్రీగా సర్వీసులు అందిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్కీమ్ తీసుకొచ్చి ఏండ్లు గడుస్తున్నా.. దీనిపై అవగాహన లేక.. అధికారుల ప్రచారం లేక.. ప్రైవేట్ డాక్టర్లు, నర్సులు, ఆర్ఎంపీ డాక్టర్ల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు.
ఇంటి దగ్గరే మినీ హాస్పిటల్
పాలియేటివ్ కేర్ అంటే ఆశా వర్కర్ వచ్చి చూసి వెళ్తారనే అపోహ ఉంది. కానీ.. హోమ్ విజిట్‌కు ట్రైన్డ్ డాక్టర్లు, నర్సుల టీమ్ ఉంటుంది. క్యాన్సర్ లాంటి జబ్బుల్లో పేషెంట్లు భరించలేనంత నొప్పితో విలవిలలాడుతుంటారు. వాళ్లకు మార్ఫిన్ లాంటి ప్రత్యేక మందులు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇచ్చి నొప్పి తెలియకుండా చేస్తారు. నెలల తరబడి మంచం మీదనే ఉంటే వీపు వెనకాల బెడ్ సోర్స్ (పుండ్లు) అయితాయి. క్యాన్సర్ గాయాలు కుళ్లిపోయి వాసన వస్తుంటాయి. అలాంటి వాటిని క్లీన్ చేసి, ఇన్ఫెక్షన్ రాకుండా ఇంటిదగ్గరే రెగ్యులర్ డ్రెస్సింగ్ చేస్తారు. నోటి ద్వారా ఆహారం తీసుకోలేక ముక్కులో పైపులు, యూరిన్ కోసం పైపులు వేసుకున్న పేషెంట్లను హాస్పిటల్ తీసుకెళ్లాలంటే నరకమే. అలాంటి వాళ్లకు ఈ టీమ్ ఇంటికి వచ్చి పైపులు మారుస్తుంది.
పక్షవాతం రోగులకు, వృద్ధులకు కండరాల బలం కోసం ఇంటి వద్దే ఫిజియోథెరపీ చేయిస్తారు. ఇవే కాకుండా.. మంచాన పడ్డ పేషంట్‌కే కాదు.. వాళ్లకు సేవలు చేసే ఇంట్లో వాళ్లకు కూడా మానసిక స్థైర్యం అవసరం. ఈ టీమ్ పేషెంట్‌తోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తుంది. ఒకవేళ పేషెంట్ కండిషన్ సీరియస్‌గా ఉంటే.. వైద్య సిబ్బందే ప్రత్యేక అంబులెన్స్‌లో జిల్లా హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తీసుకెళ్లి ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు.
ఈ ఏడాది 31వేల మందికి..
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్లు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది ఓపీలో సేవలు పొందారు. 31 వేల మందికి సిబ్బంది
ఇండ్ల వద్దకే వెళ్లి (హోం విజిట్) చికిత్స చేశారు. 10 వేల మంది ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. సంఖ్య బాగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవసరమున్న వాళ్ల సంఖ్య దీనికి పదింతలు ఉంటుంది. చాలా గ్రామాల్లో ఇలాంటి సేవలు ఉన్నాయన్న సంగతి ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
సరైన ప్రచారం లేక....
ఇంత మంచి స్కీమ్‌ను జనంలోకి తీసుకెళ్లడంలో వైద్యారోగ్య శాఖ వెనుకబడింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (పల్లె దవాఖానలు) ద్వారా ఈ సేవలు అందాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గడప గడపకూ తిరిగి మంచాన పడ్డోళ్లను గుర్తించి రెఫర్ చేయా లి. కానీ సరైన పర్యవేక్షణ, ప్రచారం లేకపోవడంతో ఆర్ఎంపీలను, ప్రైవేట్ నర్సులను, డాక్టర్లను ఆశ్రయిస్తూ ప్రజలు వేలకు వేలు ధారపోస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రచారం చేస్తే.. మంచాన పడ్డ పేదోళ్లకు వరంగా మారుతుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సేవలను పొందాలంటే.. గ్రామంలో, వార్డులో ఉండే ఆశా వర్కర్‌నుగానీ, ఏఎన్ఎంను గానీ సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్లు వివరాలు సేకరించి జిల్లా టీమ్‌కు పంపుతారు. లేదా నేరుగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కాంటాక్ట్ అయినా పాలియేటివ్ కేర్ సేవలు పొందొచ్చు.
