- రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- ఒక్కొక్కరికి 194 పేజీల 12 లాంగ్ నోట్‌బుక్స్
- మొత్తం 24 లక్షల బుక్స్ పంపిణీ పూర్తి చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలిచింది. గతంలో హాస్టల్, గురుకుల స్థాయిలో మాత్రమే ఉచిత నోట్స్ అందించేవారు. తొలిసారిగా సర్కారు కాలేజీ విద్యార్థులకు కూడా ఉచితంగా లాంగ్ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరింది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే అవసరమైన నోట్ బుక్స్ చేతికి అందడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కొక్కరికి 12 లాంగ్ నోట్‌బుక్స్..
రాష్ట్రంలో 431 సర్కారు జూనియర్ కాలేజీలుండగా, వాటిలో సుమారు 2 లక్షల మంది వరకు చదువుతున్నారు. వారికి ఏటా కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇంటర్ విద్యాశాఖ నుంచి ఉచితంగా అందించేవారు. అయితే, ఈ ఏడాది మాత్రం పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. సర్కారు కాలేజీల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఏడాదికి సరిపడ 12 లాంగ్ నోట్‌బుక్స్ చొప్పున అందించారు.
ప్రతి నోట్‌బుక్‌నూ 194 పేజీలతో క్వాలిటీ బుక్స్ పంపిణీ చేశారు. ఈ లెక్కన సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు మొత్తం 24 లక్షల నోట్‌బుక్స్‌ను కాలేజీలకు అందించారు. క్లాసులు మొదలైన వెంటనే పుస్తకాలతోపాటు వీటిని పంపిణీ చేశారు. జులై నాటికే అన్ని జిల్లాల కాలేజీలకు చేరవేశారు. విద్యార్థులందరికీ ఇప్పటికే నూటికి నూరు శాతం పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్టు ఇంటర్ విద్యాశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.
తప్పిన ఆర్థిక భారం..
సర్కారు కాలేజీల్లో అత్యధికంగా నిరుపేద విద్యార్థులే విద్యనభ్యసిస్తున్నారు. మార్కెట్లో పెరిగిన పేపర్ రేట్ల ప్రకారం.. 12 లాంగ్ నోట్‌బుక్స్ కొనాలంటే ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యికి పైగా ఖర్చయ్యేది. కుటుంబంలో ఇద్దరు విద్యార్థులుంటే ఆ భారం మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సర్కారే ఉచితంగా నోట్ బుక్స్ అందించడంతో తల్లిదండ్రులకు భారం తప్పింది.
మంచి స్పందన
ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం ద్వారా పేరెంట్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక్కో స్టూడెంట్ కు 12 లాంగ్ బుక్స్ అందించాం. పేద విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే అన్ని కాలేజీలకు పంపించాం.- అభిలాష, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్
