నెలకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నా జనానికి ఉపయోగపడట్లే

నెలకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నా జనానికి ఉపయోగపడట్లే
  • ఫ్రీ టాయిలెట్లు  గలీజుగున్నయ్
  • నెలకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నా జనానికి ఉపయోగపడట్లే

హైదరాబాద్, వెలుగు: ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్రీ పబ్లిక్ ​టాయిలెట్లు జనానికి ఉపయోగపడడం లేదు. నిర్వహణ లేక ఎక్కడ చూసినా గలీజ్​గా కనిపిస్తున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జనను అరికట్టేందుకు గతంలో 6 జోన్ల పరిధిలో 5,295 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇందులో 5,036 టాయిలెట్ల నిర్వహణను జోనల్ కమిషనర్లు ఏజెన్సీలకు అప్పగించారు. ఏరియాను బట్టి నెలకు ఒక్కోదానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. మొత్తంగా నెలకు రూ.2 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారు. కానీ ఇంటి నుంచి బయటికు వచ్చిన జనం ఫ్రీ టాయిలెట్లను వాడుకునే పరిస్థితి లేదు. ఒక్కోచోట ఒక్కో సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. 50 శాతానికి పైగా టాయిలెట్లలో నీళ్లు లేవు. మిగిలిన చోట్ల బకెట్లు, మగ్గులు ఉండట్లేదు. పని మీద బయటికి వచ్చినప్పుడు అర్జెంట్​అయితే ఉగ్గ పట్టుకుని పే అండ్​యూజ్​టాయిలెట్లను వెతుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఫ్రీ టాయిలెట్ల నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా క్లీన్ ఉంచకపోవడంపై జనం మండిపడుతున్నారు. వీటికితోడు గతంలో రద్దీ ప్రాంతాల్లో 30 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడా కనిపించడం లేదు.

క్యూఆర్​ కోడ్ చెకింగ్ అసలు ​ఉందా?

ఏజెన్సీలకు అప్పగించిన టాయిలెట్లకు క్యూ ఆర్ కోడ్ కేటాయించామని, క్లీన్​చేసే టైంతోపాటు, నిర్వహణపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. బల్దియా కమిషనర్, అడిషనల్ కమిషనర్లతోపాటు జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్ లైన్​లో పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఒక్కో టాయిలెట్​ను రోజూ 3 నుంచి 4 సార్లు క్లీన్ ​చేసేందుకు ఏజెన్సీలకు అప్పగించినట్లు చెబుతున్నారు. కమర్షియల్​ ప్రాంతాల్లో అయితే రోజుకు 4 సార్లు, నాన్​కమర్షియల్ ప్రాంతాలైతే 3 సార్లు క్లీన్​చేయాల్సి ఉంది. నిర్వహణను క్యూర్​కోడ్ ద్వారా చెక్​ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్లీనింగ్​సరిగ్గా చేయని ఏజెన్సీలకు ఫైన్లు వేస్తున్నామని అంటున్నారు. కానీ అధికారుల మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితికి ఎక్కడా పొంతన లేదు. ఏజెన్సీలకు అప్పగించినవి కాకుండా మిగతావి యాడ్స్​కోసం ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల అవి కూడా డ్యామేజ్​అవడంతో తొలగించారు. హైదరాబాద్​వంటి మెట్రో సిటీలో క‌‌మర్షియ‌‌ల్ ఏరియాల్లో కిలో మీటరుకు ఒకటి, మిగిలిన చోట్ల 2 నుంచి 3కిలోమీట‌‌ర్లకు ఒక ప‌‌బ్లిక్ టాయిలెట్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు లేవు. ఉన్నచోట క్లీన్​గా లేకపోవడంతో జనానికి ఉపయోగపడడం లేదు. పే అండ్​యూజ్ టాయిలెట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అలాగే నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను గతంలో 30 మొబైల్ టాయిలెట్లుగా రూపొందించి రద్దీ ప్రాంతాల్లో ఉంచేవారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడంలేదు. 

కొనసాగుతున్న విచారణ

కోట్లు ఖర్చు చేస్తున్నా గ్రేటర్​లోని టాయిలెట్లు తమకు ఉపయోగపడడం లేదని జనం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నిర్వహణ ఖర్చుపై ఇంటజెన్స్ అధికారులు  నిఘా పెట్టారు. నాలుగైదు నెలలుగా విచారణ కొనసాగుతోంది. చెల్లిస్తున్న బిల్లుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.