90 రోజులు.. నో షుగర్ ఛాలెంజ్: మీలో వచ్చే ఆరోగ్య మార్పులు ఇవే.. ఇప్పుడు హెల్త్ ట్రెండింగ్ ఇదే..!

90 రోజులు.. నో షుగర్ ఛాలెంజ్: మీలో వచ్చే ఆరోగ్య మార్పులు ఇవే.. ఇప్పుడు హెల్త్ ట్రెండింగ్ ఇదే..!

బీపీ, షుగర్.. ఈ రెండు వ్యాధులు ప్రస్తుతం ప్రపంచానికి సవాల్‎గా మారాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాతే షుగర్  వస్తుందనే రోజులు పోయాయ్. ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా షుగర్ అందరినీ పలకరిస్తోంది. 10 నెలల పసి పిల్లల నుంచి 80 ఏళ్ల పండు ముసలి వారి వరకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధులు ఒక్కసారి వచ్చాయంటే పూర్తిగా నయం కావు. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్‎లో ఉంచుకోవాల్సిందే. మనుపటిలా ఇష్టం ఉన్న ఆహారం తీసుకోలేం. ప్రాణాలతో ఉండాలంటే ఇష్టాలను చంపుకుని నోటికి తాళం వేయాలి.

లేదంటే ప్రాణాలకే ప్రమాదం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు,  అధిక చక్కర స్థాయిలు ఉండే ఆహారం తీసుకోవడం వల్లే షుగర్ ఎటాక్ చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మన రోజువారీ ఆహారంలో చక్కెరను పూర్తిగా తొలగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం 90 డేస్ నో షుగర్ ఛాలెంజ్ పాటించాలని..  తద్వారా ఎన్నో సత్ఫాలితాలు ఉంటాయంటున్నారు.

ఢిల్లీలోని CK బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ మనీషా అరోరా ప్రకారం.. షుగర్‎ వ్యాధి రావడానికి టేబుల్ షుగర్ ఒక్కటే కారణం కాదు. ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, తీయ్యటి స్నాక్స్, క్యాండీలు, అధిక-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న ఆహారాలు కూడా నష్టం చేస్తాయని తెలిపారు.  తేనె వంటి హానిచేయని సహజ స్వీటెనర్లను కూడా అధికంగా తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తలెత్తుతాయని చెప్పారు. 

90 డేస్ నో షుగర్ ఛాలెంజ్‎లో ఏం చేయాలంటే..?

90 డేస్ నో షుగర్ ఛాలెంజ్‏లో షుగర్ వ్యాధికి కారకాలైన ఆహార పదార్థాలను అవైడ్ చేయాలి. అధిక చక్కర స్థాయిలు ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. అయితే, ఇన్ని రోజులు ఆ ఫుడ్‎కు అలవాటు పడి ఒక్కసారిగా మానేయడం కష్టమే. ఇలా చేయడం వల్ల మొదట్లో తీవ్రమైన కోరికలు, తలనొప్పి, అలసట, చిరాకు ఉంటాయి.  శరీరం మొదట్లో ప్రతిఘటించినప్పటికీ..  కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతోంది. 

కాలక్రమేణా లక్షణాలు తగ్గుతాయి. అలవాట్లు మారడం ప్రారంభమవుతాయి. వారాలు గడిచేకొద్దీ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలామందిలో మెరుగైన నిద్ర, జీర్ణక్రియ, మానసిక స్థితి ఏర్పడుతోంది. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడటంతో పాటు జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంట తగ్గడంతో చర్మం క్లియర్ కావడం ప్రారంభమవుతుంది. 

90 రోజులు పూర్తయ్యే సమయానికి శారీరకంగా, మానసికంగా పరివర్తన చెందుతారు. శరీరం మునపటి కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ ఛాలెంజ్‎కు దృఢ సంకల్పం అవసరం. సీరియస్‎గా ఫాలో అవుతే మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. శరీరంలో శాశ్వత మార్పులు చేసుకోవాలనుకునే వారికి 90 రోజుల నో షుగర్ చాలెంజ్ ఒక మలుపు కావచ్చు.