ఉల్లంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత

ఉల్లంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత

చిగురుమామిడి, వెలుగు: మూతపడడానికి సిద్ధంగా ఉన్న సర్కార్ స్కూల్‌‌‌‌ను కాపాడుకునేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలోకి సోమవారం వచ్చిన రెండు ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉల్లంపల్లిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. గతంలో ఈ స్కూల్ లో విద్యార్థుల సంఖ్య బాగానే ఉండేది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తూ ఇప్పుడు 15 మందికి చేరింది. ఈ స్కూల్ లో 8 మంది టీచర్లకు పోస్టింగ్ ఉండగా.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, వారిలో ముగ్గురిని విద్యాశాఖాధికారులు ఇటీవల సుందరగిరి, బొమ్మనపల్లి  స్కూళ్లకు డిప్యూటేషన్ పై పంపారు.

విద్యార్థుల సంఖ్య తగ్గిన కారణంగా భవిష్యత్ లో స్కూల్ మూతపడే ప్రమాదం ఉండడంతో ఇటీవల హెచ్ఎం, గ్రామస్తులు సమావేశమై ప్రభుత్వ బడిని బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన 39 మంది విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి రావద్దని డ్రైవర్లను హెచ్చరించి గ్రామ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. దీంతో బస్సులు వెనుదిరిగి వెళ్లాయి.