ఎల్లారెడ్డిపేట మండలంలో  క్షుద్ర పూజతో వ్యక్తిని చంపాలని సుపారీ ..ఐదుగురిపై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట మండలంలో  క్షుద్ర పూజతో వ్యక్తిని చంపాలని సుపారీ ..ఐదుగురిపై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఆస్తి వివాదంలో ఓ అక్క.. చిన్నమ్మ కూతురి భర్తను చంపేందుకు ఓ క్షుద్ర పూజారికి సుపారీ ఇవ్వడం ఎల్లారెడ్డిపేట మండలంలో కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌‌‌‌ఐ రాహుల్‌‌‌‌రెడ్డి వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన రాగుల హరిచంద్‌‌‌‌కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజ్‌‌‌‌ఖాన్‌‌‌‌పేటకు చెందిన తాళ్లపల్లి కవిత కూతురు అశ్వితను ఇచ్చి 2022లో  పెండ్లి చేశారు.

కట్నంగా కొంత భూమి, బంగారం అప్పజెప్పారు. కాగా ఇచ్చిన భూమిపై తనకు హక్కు ఉందని పెద్దమ్మ మద్దికుంట స్వరూప పెండ్లయిన నెలరోజుల నుంచి అశ్వితను టార్చర్‌‌‌‌‌‌‌‌ పెడుతోంది. ఈక్రమంలో స్వరూపతోపాటు ఆమె సోదరులు అధికం శంకర్, అధికం సత్తయ్యగౌడ్, మద్దికుంట బాలాగౌడ్, మద్దికుంట శ్రీధర్‌‌‌‌‌‌‌‌ కలిసి వెంకటాపురం గ్రామానికి చెందిన క్షుద్ర పూజలు చేసే బైండ్ల రాకేశ్‌‌‌‌ను సంప్రదించారు.

హరిచంద్‌‌‌‌ను పూజలతో చంపాలని లేదా హత్య చేయాలని సుపారీ మాట్లాడారు. కాగా సదరు క్షుద్ర పూజారి సరైన టైంలో పూజలు చేయకపోవడంతో వారితో  ఫోన్లో మాట్లాడుతూ కాళ్లు పనిచేయకుండా చేయాలా? లేదంటే ప్రాణాలే పోయేలా చేయాలా అంటూ మాట్లాడిన ఫోన్​ ఆడియో రికార్డు రెండు రోజుల కింద బయటకు వచ్చింది. దీంతో అశ్విత– హరిచంద్‌‌‌‌ ఫిర్యాదు మేరకు సోమవారం స్వరూపతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.