ఆర్టీసీ ప్రయాణికులకు ఎంజీబీఎస్ వద్ద బగ్గీ ఫ్రీ

ఆర్టీసీ ప్రయాణికులకు ఎంజీబీఎస్ వద్ద బగ్గీ ఫ్రీ

వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు 

హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు ఎంజీబీఎస్ వద్ద ఉచిత బగ్గీ వాహన సదుపాయం కల్పించింది ఆర్టీసీ.  ప్రత్యేక కేటగిరి వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ఉచిత కరెంటు వాహన సౌకర్యాన్ని కల్పించింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 
తాజాగా ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల కష్టాలు చూసి సరికొత్త తరహా పరిష్కారం చూపారు. ఎంజీబీఎస్ బయట మెయిన్  రోడ్డుపై నుంచి ప్లాట్ ఫారమ్ వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అలాగే ప్లాట్ ఫారం వద్ద బస్సు దిగిన వారు కూడా బయటకు వచ్చేందుకు ఫ్రీ.  గత జనవరి 1వ తేదీ నుండే అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం అన్ని వర్గాల మన్నలను అందుకుంటోంది. సీబీఎస్ కువచ్చిన వారంతా ఇలాంటి వాహనాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ కృతజ్ఘతలు చెబుతూ.. మిత్రులకు షేర్ చేసుకుంటున్నారు.
వృద్ధులు, ప్రత్యేక కేటగిరి వారికి ఊరట 
హాత్మాగాంధీ బస్టాండ్ ఆసియా ఖండంలోనే అతిపెద్దది. సెంట్రల్ బస్టేషన్ నుండి బస్సెక్కి వెళ్లడానికి వచ్చే వారిలో ఎక్కువ మంది ఎంజీబీఎస్ బయట.. పాత ఎంజీబీఎస్ బస్టాప్ వద్దే దిగిపోతుంటారు. అక్కడి నుండి సీబీఎస్ లో ప్లాట్ ఫారం వరకు వెళ్లాలంటే కనీసం 400 నుంచి 500 మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. లగేజీతో వస్తే మాత్రం చాలా కష్టం. ఇక వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల పరిస్థితి సరేసరి. కూలీలకు వందల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి.. లేదంటే అవస్థలు పడుతూ సకాలంలో ప్లాట్ ఫారంకు చేరడం నిజంగా ఒక నరకం లాంటిదే. సిటీ నలుమూలల  నుండి ఆటోలు, సిటీ బస్సుల్లో లేదా సొంత వాహనాల్లో సీబీఎస్ కు వచ్చే వారికి కష్టాలు చిరపరిచితమే.

అయితే ఆర్టీసీ ఎండీగా వచ్చిన సజ్జనార్ తరచూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. బస్టాండ్లను తనిఖీ చేస్తూ.. ప్రయాణికులతో మాటామంతీ చేస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకుంటూ తనదైన పరిష్కారాలు చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎంజీబీఎస్ బయట నుంచి ప్లాట్ ఫామ్ వరకు  ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ఉన్న ఈ సదుపాయాన్ని 24 గంటలూ కొనసాగేలా చేయాలంటున్నారు. ఇలాంటి వాహనాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సేవలు ఉపయోగించుకుంటున్న వారి ముచ్చట కింద వీడియోలో చూడండి...