
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యాజమాన్యం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రయాణికులు బస్సు ప్రయాణాన్ని, బస్సుల కోసం స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని ఇక నుంచి బోర్ గా కాకుండా ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వైఫై సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బస్సులతో పాటు బస్ స్టేషన్లలో కూడా ఈ సౌకర్యాన్ని అందించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓ ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో చర్చలు జరిపిన యాజమాన్యం.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన మంత్రి పొన్నం.. వైఫై సౌకర్యం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం తమ ప్రణాళికను అమలు చేసే చర్యలను వేగవంతం చేసింది.
అన్ని రకాల బస్సులు, బస్ స్టేషన్లలో..
అన్ని రకాల బస్సులు, బస్ స్టేషన్లలో ఒకేసారి వైఫై సౌకర్యాన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ లలో సెలెక్ట్ చేసిన సినిమాలు, పాటలను మాత్రమే చూడగలుగుతారు.తర్వాత సాధారణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ఈ సినిమాలు, పాటలు చూస్తున్న సమయంలో మధ్య మధ్యలో అడ్వర్టయిజ్మెంట్లు కూడా వస్తాయి.
వీటి ద్వారా భారీగానే ఆదాయం వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. ఇలా వచ్చే ఆదాయం ఇటు ఇంటర్నెట్ సంస్థకు, అటు ఆర్టీసీ యాజమాన్యానికి చెరి సగం చొప్పున లభించనుంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు వినోదాన్ని పంచడంతో పాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చనుంది.