
పారిస్: సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌ను సునాయాస విజయంతో ఆరంభించాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–-3, 6–-3, 6–-3 తో అమెరికాకు చెందిన మకెంజీ మెక్‌డొనాల్డ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గంటా 58 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో నొవాక్ పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. బలమైన సర్వీస్‌లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన జొకో.. మ్యాచ్ మొత్తంలో ఏడు ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టి, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) 6–4, 6–3, 7–5తో ఫ్రాన్స్ ప్లేయర్ చెందిన ఆర్థర్ రిండర్‌క్నెచ్‌పై గెలిచాడు.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సినర్‌కు ఇది వరుసగా 15వ విజయం కావడం విశేషం. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-–3, 6-–3, 6-–4 తో లర్నర్ టియెన్ (అమెరికా)ను ఓడించాడు. కానీ, 11వ సీడ్ రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు షాక్ తగిలింది. కామెరూన్ నోరి (బ్రిటన్) 7–-5, 6–-3, 4-–6, 1-–6, 7–-5తో మెద్వెదెవ్‌కు చెక్ పెట్టాడు. - 16వ సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) ) 6–-2, 6–-3, 6–-0 తో క్వాలిఫయర్ ఈథన్ క్విన్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగు పెట్టాడు.
గాఫ్ ముందుకు..
విమెన్స్ సింగిల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ బోణీ చేసింది. రెండో సీడ్ గాఫ్ 6-–2, 6–-2తో వరుస సెట్లలో ఆస్ట్రేలియాకు చెందిన ఒలివియా గాడెకిని చిత్తు చేసింది. బెలారస్ స్టార్ విక్టోరియా అజరెంకా 6-–0, 6–-0తో యానినా విక్‌మేయర్ (బెల్జియం)పై ఈజీగా గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ జెస్సికా పెగులా 6–-2, 6–-4 తో అంకా టోడోనీ (రొమేనియా)ను ఓడించగా, ఆరో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) 6–-4, 6-–3 తో స్పెయిన్‌కు చెందిన క్రిస్టినా బుక్సాపై విజయం సాధించింది. 16వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 3–-6, 6-–7 (4/7), 7-–6 (7/5) తో ఎల్సా జాక్మోట్ (ఫ్రాన్స్), 31వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా ) 6--–3, 6--–1 వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్)పై గెలిచారు.