ఇన్​స్టాగ్రామ్​లో దోస్తీ​.. ఇంటికొచ్చి దోపిడీ

ఇన్​స్టాగ్రామ్​లో దోస్తీ​.. ఇంటికొచ్చి దోపిడీ
హైదరాబాద్‌, వెలుగు: ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఒక ఎన్జీఓ ఆర్గనైజర్​తో పరిచయం పెంచుకున్న నలుగురు కర్నాటక యువకులు ఆయన ఇంటికి వచ్చి భారీ దోపిడీ చేశారు. డబ్బు, వస్తువులు , వెహికల్స్ తీసుకొని చెక్కేశారు. అంతకుముందు ఆయనను విపరీతంగా కొట్టి బంధించారు. కొట్టేసిన కార్లతోనే మళ్లీ హైదరాబాద్​కు వచ్చి పోలీసులకు చిక్కారు.  సోమవారం ఎల్ బీనగర్ లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఈ కేసు వివరాలు తెలిపారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన వడ్లమూడి నిఖిల్(23), వడ్లమూడి వినయ్ చౌదరి(27), ఏల ఉదయ్ కుమార్(23), గోగినేని బ్రహ్మ తేజ(22) చిన్ననాటి స్నేహితులు.చెడు అలవాట్లకు బానిసయ్యారు. విపరీతంగా అప్పులూ చేశారు. డబ్బు సమస్యలు ఎక్కువ కావడంతో నేరాల బాట పట్టారు. నిఖిల్​ పై కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి,దావణగిరి పోలీస్ స్టేషన్ తో పాటు హైదరాబాద్​లోనూ నాలుగు కేసులు ఉన్నాయి. ‘హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్’ అనే స్వచ్చంద సంస్థ నడిపే వనస్థలిపురంవాసి సతీష్ సిక్కాతో నిందితులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు.  ఆయన దగ్గర డబ్బులు కొట్టేయాలని ప్లానేశారు. ఇందుకోసం కర్నాటక నుంచి డమ్మీగన్‌ తీసుకొచ్చారు.  ఈ నెల15న వనస్థలిపురంలోని సిక్కా ఇంటికి వచ్చి మంచినీళ్లు కావాలని అడిగారు.  నలుగురూ లోపలికి వెళ్లి సిక్కాపై దాడి చేశారు. నోటికి ప్లాస్టర్​ వేసి, తాడుతో చేతులు కట్టేశారు. బొమ్మ పిస్టల్ తో బెదిరించి అల్మారాలోని రూ .1.18 లక్షలు, విదేశీ కరెన్సీ, రెండు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్ ఫోన్లు , సిల్వర్ నెక్లెస్ , నాలుగు పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్, క్రెటా కారు, ఇయాన్ కారు, కేటీఎమ్ బైక్ లను తీసుకొని గోవా పారిపోయారు. మరోసారి నేరం చేసేందుకు బాధితుడి కార్లలోనే సోమవారం శంషాబాద్​ వచ్చారు. ఎల్ బీ నగర్ సీసీఎస్ పోలీసులు నలుగురినీ అరెస్టు చేసి, సిక్కాకు చెందిన వెహికల్స్​ను, ఇతర వస్తువులను, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి దగ్గర దోచుకున్నవేగాక రెండు బొమ్మ పిస్టల్స్, ఎలుగు బంటి గోరును స్వాధీనం చేసుకున్నామని కమిషనర్​ భగవత్​ వివరించారు. ఈ సమావేశంలో ఎల్ బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ , క్రైమ్ డీసీపీ యాదగిరి , అడిషనల్ డీసీపీ క్రైమ్ డి.శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.