ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్​రూం ఇండ్లిస్తాం: కేటీఆర్

ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్​రూం ఇండ్లిస్తాం: కేటీఆర్
  • అక్టోబర్​లోగా పంపిణీ పూర్తి చేస్తాం


హైదరాబాద్​/ఎల్బీ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 118 జీవో ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 18వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్​రూం ఇండ్లు పూర్తయ్యాయని, వీటిని ఆగస్టు 15 నుంచి అక్టోబర్​లోగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. బుధవారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్​లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 118 జీవో లబ్ధిదారులకు కేటీఆర్ పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎల్బీనగర్ సెగ్మెంట్​లో 4వేల డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద 3వేల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించారు. జీవో నంబర్ 58, 59 కింద 11వేల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని వివరించారు. దీంతో ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 40వేల కుటుంబాలకు సొంతింటి కల నెరవేరిందన్నారు. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని తెలిపారు. ఐదేండ్లలోనే ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ (కాళేశ్వరం) ప్రాజెక్ట్​ను పూర్తి చేశామన్నారు. 

ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో సేవలు
ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ 159 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నిర్మించినప్పుడే మెట్రో కోసం స్థలం  కేటాయించారని,  ఇప్పుడు ఎలాంటి భూసేకరణ పనుల్లేకుండా తక్కువ ఖర్చుతోనే  మెట్రో  నిర్మాణం చేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్యెల్సీలు ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జీహెచ్​ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్​తో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.  

ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఏర్పాటు చేశాం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నల్లగొండ ఫ్లోరైడ్, పాలమూరు వలసలు వంటి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఏర్పాటు చేశామని, హైదరాబాద్ సిటీకి నాలుగు వైపులా 2వేల పడకల కెపాసిటీతో హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. నిమ్స్ లో మరో రెండు వేల పడకలు జత చేసి కొత్తగా 10వేల బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. మరో 314 కిలో మీటర్ల మెట్రో రూట్​కు కేసీఆర్ పర్మిషన్ ఇచ్చారని వివరించారు. మెట్రో ప్రాజెక్ట్​లో భాగంగా నియోజకవర్గంలోని నాగోల్ నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్​నగర్ మీదుగా ఓఆర్ఆర్ దాకా మెట్రోవిస్తరింపజేస్తున్నామని తెలిపారు. 

రుణమాఫీ ప్రకటనపై సంబురాలు చెయ్యండి: కేటీఆర్​
రైతు రుణమాఫీని అమలు చేయాలని సీఎం కేసీఆర్​ ప్రకటించిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ కార్యకర్తలు సంబురాలు నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నరేండ్లుగా రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, ఇప్పుడు రుణమాఫీని అమలు చేస్తున్నదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఊరు, మండలం, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులందరితో కలిసి సంబురాలు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జిలు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.