పెట్రోల్ కష్టాలు..బంకుల దగ్గర కిలో మీటర్ల మేర వాహనాల క్యూ..ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి 

పెట్రోల్ కష్టాలు..బంకుల దగ్గర కిలో మీటర్ల మేర వాహనాల క్యూ..ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి 

పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్​ బంకుల దగ్గర వాహనదారులు క్యూలు కట్టారు. చాలా బంకుల్లో నో స్టాక్​ బోర్డు దర్శనమిస్తుండటంతో ఈ భయం వాహనదారుల్లో మరింత పెరిగింది. దీంతో పెట్రోల, డీజిల్ కోసం ఎక్కడ చూసినా బంకుల దగ్గర కిలోమీటర్లు మేర క్యూలు కనబడుతున్నాయి.  బుధవారం( మార్చి 25) హైదరాబాద్ సిటీలో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.  

హైదరాబాద్​ సిటీలోని అన్ని ప్రాంతాల్లో బంకుల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టారు వాహనాదారులు. కుత్భుల్లాపూర్​ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో  ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల బంకులకు రావడంతో రద్దీ ఏర్పడింది.కిలో మీటర్లు వాహనాలు క్యూలో ఉన్నాయి.

పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి. పలుచోట్ల  నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులను మూసివేస్తున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అంబర్ పేట, దిల్ సుఖ్​ నగర్​, మల్కాజిగిరి, రాజేంద్రనగర్​,అత్తాపూర్​, మైలార్​ దేవ్​పల్లి, కుత్బుల్లాపూర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీ,చందానగర్​, హైదరాగూడ, బషీర్​ బాగ్​,కూకట్​పల్లి, లింగంపల్లి,చందానగర్​  వంటి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. 

మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు, పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి. రేపటి నుంచి పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో కరీంనగర్ లోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనాలు పెట్రోల్ కోసం బారులు తీరాయి. జగిత్యాలలో కొన్ని  పెట్రోల్​ బంకుల్లో నో స్టాక్​ బోర్డులు దర్శనిమిస్తున్నాయి.  పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో  వరంగల్ టౌన్, ములుగు, జగిత్యాల, నిర్మల్ జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కూడా పెట్రోల్​ బంకుల్లో రద్దీ  ఏర్పడింది.

ట్యాంక్ ఫుల్ కోసం..

మరోవైపు పెట్రోల్​ కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా, వాటర్ క్యాన్లతో వచ్చి పెట్రోల్ తీసుకెళ్తుండటం రద్దీని మరింత పెంచుతోంది. ఇదే తరుణంలో క్యాబ్, ఆటో డ్రైవర్లు చార్జీలను రెట్టింపు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి, ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని డీలర్లు చెప్తున్నారు. డిమాండ్​ కు  సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిమాణంలోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల వ్యవధిలోనే అయిపోతోందని డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో బంకులన్నీ మూసివేసి నిరసన తెలుపుతామని తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి హెచ్చరించారు.