మహిళా నాయకత్వంతోనే సమాజంలో మార్పు... ఓయూలో అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభం

మహిళా నాయకత్వంతోనే సమాజంలో మార్పు... ఓయూలో అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభం
  •     “గివ్ టు గెయిన్ - మహిళా సుస్థిరత”పై మేథోమధనం 

ఓయూ, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ మహిళా సదస్సు మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో వైభవంగా ప్రారంభమైంది. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అధ్యక్షత వహించిన సదస్సుకు భారత సైన్యం మాజీ అధికారిణి కెప్టెన్ మీరా సిద్ధార్థ దవే ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా మేధావులు, పరిశోధకులు పాల్గొన్న ఈ సదస్సు “గివ్ టు గెయిన్ - మహిళా సుస్థిరత” ప్రధానాంశంతో సాగింది. డాక్టర్ యశోద ఠాకోర్ సాంస్కృతిక ప్రదర్శన అనంతరం కెప్టెన్ మీరా సిద్ధార్థ దవే మాట్లాడుతూ ‘గివ్ టు గెయిన్’ అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం కాదని, సమాజంలో మార్పుకు మార్గదర్శకం అని తెలిపారు. 

దేశం, సమాజ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నైతిక నాయకత్వమే నిజమైన సుస్థిరతకు పునాదిగా వివరించారు. వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం సదస్సు కేవలం విద్యా కార్యక్రమం మాత్రమే కాకుండా, ప్రపంచ సుస్థిరతలో మహిళల పాత్రను బలపరచే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఓయూలో 50 శాతానికి పైగా విభాగాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని, 65 శాతం మంది విద్యార్థులు మహిళలే అని గర్వంగా ప్రకటించారు. 

సమాజ మార్పు కోసం మహిళా నాయకత్వమే కీలకమని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డి సామాజిక సమానత్వం కోసం విద్యార్థులు వాస్తవిక పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. మహిళలు త్యాగానికి ప్రతిరూపమని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టడంలో వారి పాత్ర అపారమని అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యంపై పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, రొమ్ము క్యాన్సర్ అవగాహనపై పద్మశ్రీ డాక్టర్ పి. రఘురామ్ కీలక ప్రసంగాలు చేశారు. తెలంగాణ మహిళా ఉద్యమాల చరిత్రను ప్రొఫెసర్ రేఖా పాండే వివరించారు. 

అంతర్జాతీయ విద్య, ఆవిష్కరణలు, ఆరోగ్య పాలన వంటి అంశాలపై డాక్టర్ రోహిణి రేగంటి, జరీనా పర్వీన్, తేజస్విని, హెప్సిబా కోర్లపాటి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చట్టపరమైన సాధికారతపై గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ప్రసంగంతో మొదటి రోజు సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. సదస్సు నిర్వహణలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేశ్​రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్ కీలక పాత్ర పోషించగా, సీనియర్ ప్రొఫెసర్ విజ్జులత కన్వీనర్‌‌గా వ్యవహరిస్తున్నారు.