ఓ పక్క యుద్దం..మరో పక్క కుండపోత వానలు..గల్ఫ్ దేశాల్లో అల్లకల్లోలం..వీడియోలు వైరల్

ఓ పక్క యుద్దం..మరో పక్క కుండపోత వానలు..గల్ఫ్ దేశాల్లో అల్లకల్లోలం..వీడియోలు వైరల్

యుద్ధంతో అల్లాడుతున్న గల్ఫ్ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు, వాహనాలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. వరదల్లో చిక్కుకున్న డజన్ల కొద్దీ మందిని రక్షించారు. వరదల్లో చిక్కుకొని నలుగురు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అసాధారణ రీతిలో  వాతావరణపరిస్థితులు ఈ ఆకస్మిక వర్షపాతానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ విశ్లేషణలు చెబుతున్నాయి. 

మార్చి చివరి వారంలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబీ, ఖతార్ ,బహ్రెయిన్‌లలో 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. 

గల్ఫ్​ప్రాంతం అంతటా కుండపోతవర్షం, వరదల భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్ వక్రా లో భారీ ఉరుములతో కూడిన వర్షం తర్వాత అకస్మాత్తుగా వరదలు ముంచెత్తిన వీడియోలు వెలుగు చూశాయి. ఆ ప్రాంతంలో వీధులన్నీ నదులను తలపిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిలో అనేక వాహనాలు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తున్నాయి.