10 శాతం నిధులు ఖర్చు చేస్తే ‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తవుతుంది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

10 శాతం నిధులు ఖర్చు చేస్తే ‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తవుతుంది :  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు : కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనుల కోసం కేవలం రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కేఎల్ఐ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్‌‌ను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా ఈ ప్రాజెక్టు విషయంలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నందున మరో 45 రోజుల పాటు పంటలకు సాగునీరు అందించవచ్చని, ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డగా ఉండి కూడా ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.జూరాల వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని, నార్లాపూర్, ఏదుల లాంటి రిజర్వాయర్లను తక్షణమే నింపి ఉమ్మడి పాలమూరుతో పాటు ఇతర జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చాలని కోరారు.