పోలీసుల ఎదుట లొంగిపోయిన అమృత్‌పాల్‌ సింగ్‌‌.. 37రోజుల పరారీ తర్వాత అరెస్ట్

పోలీసుల ఎదుట లొంగిపోయిన అమృత్‌పాల్‌ సింగ్‌‌.. 37రోజుల పరారీ తర్వాత అరెస్ట్

గత నెల మార్చి 18నుంచి పరారీలో ఉంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌‌ ఎట్టకేలకు పంజాబ్ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. అరెస్టును ధృవీకరించిన పంజాబ్ పోలీసులు శాంతిని కాపాడాలని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. పంజాబ్‌లోని మోగాలో అమృతపాల్ సింగ్‌ ను ఉదయం 6.45 గంటలకు అరెస్టు చేశామని తెలుపుతూ పోలీసులు ట్వీట్ చేశారు. అమృత్‌సర్ పోలీస్ & పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ వింగ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయని, పవిత్రతను కాపాడుకోవడానికి పోలీసులు గురుద్వారా సాహిబ్‌లోకి ప్రవేశించలేదని చెప్పారు.

పంజాబ్ లోని మోగా జిల్లా రోడే గ్రామంలోని గురుద్వారాలో అమృత్‌పాల్‌ సింగ్‌ లొంగిపోయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అతను సాంప్రదాయక తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. అమృతపాల్ సింగ్ ఏప్రిల్23న రాత్రి తన గ్రామమైన జల్లుపూర్ ఖేరా చేరుకుని ఉదయం ప్రార్థనలు చేసినట్లు తెలిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసిన పోలీసులు.. అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.

అమృత్ పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఫిబ్రవరిలో పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. ఆ అరెస్టును వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ అనుచరులు పెద్ద సంఖ్యలో అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై అప్పట్లో కేసు నమోదైంది. అప్పట్నుంచి అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

https://twitter.com/PunjabPoliceInd/status/1649960198348627968