గుడి పక్కన పూల దుకాణానికి రూ.1.72 కోట్ల వేలం

గుడి పక్కన పూల దుకాణానికి రూ.1.72 కోట్ల వేలం
  • గుడి పక్కన పూల దుకాణానికి రూ.1.72 కోట్ల వేలం
  • ఇండోర్‌‌‌‌లోని శ్రీఖజ్రానా గణేశ్‌‌ మందిర్‌‌‌‌ షాప్‌‌కు ఫుల్‌‌ డిమాండ్‌‌
  • 30 ఏండ్ల లీజుకు వేలం పాట 

ఇండోర్‌‌‌‌: ఇండోర్‌‌‌‌లోని ప్రఖ్యాత శ్రీఖజ్రానా గణేశ్‌‌ మందిర్‌‌‌‌ సమీపంలో పూజా సామగ్రి అమ్మే షాపు లీజు రూ.1.72 కోట్లు పలికింది. 69.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ షాపును 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చారు. దేశంలోని అత్యంత కాస్ట్‌‌లీ రియల్‌‌ ఎస్టేట్‌‌ డీల్స్‌‌లో ఇది ఒకటి అని పలువురు అంటున్నారు. ఇండోర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ (ఐడీఏ) గుడికి పక్కన ఉన్న ఏ1 నంబర్‌‌‌‌ ఉన్న షాపునకు వేలం నిర్వహించింది. చదరపు అడుగుకు ప్రభుత్వం రూ.43 వేలుగా నిర్ణయించగా, అత్యధికంగా రూ.2.47 లక్షలు పలికింది. ఐడీఏ సీఈవో రామ్‌‌ ప్రకాశ్‌‌ అహిర్వార్‌‌‌‌ మాట్లాడుతూ, షాప్‌‌ ఏ1 బేస్‌‌ ధర రూ.30 లక్షలు కాగా, మొత్తం ఆరు బిడ్లు వచ్చాయని చెప్పారు. రూ.40 లక్షలు, రూ.60.8 లక్షలు, రూ.91.1 లక్షలు, రూ.1.1 కోట్లు, రూ.1.61 కోట్లు, రూ.1.72 కోట్లు బిడ్లు వచ్చాయని పేర్కొన్నారు.

రూ.1.72 కోట్లతో దేవేంద్ర రాథోడ్‌‌ అనే వ్యక్తి వేసిన బిడ్‌‌ను చూసిన అధికారులు షాక్‌‌ అయ్యారు. ఇంత మొత్తానికి పొరపాటున బిడ్‌‌ వేశారేమోనని అధికారులు ఆయనను కలిసి క్రాస్‌‌ చెక్‌‌ చేసుకోగా, నిజంగానే ఆ షాప్‌‌ కోసం రూ.1.72 కోట్లతో బిడ్‌‌ వేసినట్లు దేవేంద్ర స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని డిపాజిట్‌‌ చేసేందుకు దేవేంద్రకు నెల రోజుల టైమ్‌‌ ఇచ్చారు. బిడ్‌‌ పొందిన వ్యక్తి 30 ఏండ్ల పాటు ఈ షాపులో పూలు, ప్రసాదం, ఇతర పూజా సామగ్రి అమ్మేందుకే మాత్రమే అనుమతి ఉంది. ఖజ్రానా గణేశ్‌‌ గుడికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. అలాగే, షాప్‌‌ 20ఏ కూడా లీజ్‌‌ బేస్‌‌ ధర రూ.20 లక్షలు కాగా, రూ.22.5 లక్షలు వేలంలో పలికిందని అధికారులు వెల్లడించారు.