ఫంక్షనల్ ఫ్రీజ్.. బద్ధకం కాదు.. మానసిక ఒత్తిడి!

ఫంక్షనల్ ఫ్రీజ్..  బద్ధకం కాదు.. మానసిక ఒత్తిడి!

ఈరోజుల్లో చాలామంది పెద్దలు ఒక మాట తరచూ అంటున్నారు “ఇప్పటి పిల్లలకు ఓపిక లేదు. పని అంటే ఆసక్తి లేదు. ఫోన్ తప్ప వాళ్లకు ఇంకేమీ కనిపించడం లేదు”అని. బయటకు చూస్తే అది నిజమే అనిపించొచ్చు. గంటల తరబడి మొబైల్ చేతిలోనే ఉంటుంది. చేయాల్సిన పని ముందు పెట్టుకుని కూడా మొదలుపెట్టరు. కానీ మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తున్న విషయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వాళ్లు సోమరులు కాదు.. వాళ్ల మెదడు పూర్తిగా అలసిపోయింది. ఈ పరిస్థితినే ఇప్పుడు “ఫంక్షనల్ ఫ్రీజ్” అంటున్నారు. 

అంటే మనసులో వంద ఆలోచనలు పరుగెత్తుతుంటాయి.. కానీ శరీరం మాత్రం కదలదు. చేయాల్సిన పని తెలుసు. డెడ్‌‌లైన్ కూడా తెలుసు. ఆలస్యం అవుతోందన్న టెన్షన్ కూడా ఉంటుంది. అయినా మొదటి అడుగు పడదు. ఎందుకంటే మెదడు ఒకేసారి చాలా ఒత్తిడిని మోస్తూ “షట్‌‌డౌన్ మోడ్”లోకి వెళ్లిపోతుంది.జెన్​ జీ జీవితం బయటకు ఎంత కలర్‌‌ఫుల్‌‌గా కనిపించినా, లోపల మాత్రం నిరంతర ఒత్తిడితో నిండి ఉంటుంది. ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచే కంపారిజన్స్ మొదలవుతాయి. 

సోషల్ మీడియాలో ఎవరో విదేశాల్లో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెవరో భారీ ప్యాకేజీ జాబ్ కొట్టారు. మరొకరు ఫిట్‌‌నెస్‌‌, రిలేషన్‌‌షిప్‌‌, డబ్బు.. అన్నీ పర్ఫెక్ట్‌‌గా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామందిలో “నేను వెనకబడిపోతున్నానా?” అనే భావన పెరిగిపోతోంది.అక్కడినుంచే మానసిక ఒత్తిడి మొదలవుతుంది. ఏ పని చేసినా “ఇది సరిపోతుందా?”, “తప్పు అయితే?”, “ఇంకొంచెం బెటర్‌‌గా చేయాల్సిందేమో?” అనే ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. చివరకు ఆ అధిక ఆలోచనలే పనిని ఆపేస్తాయి. బయటకు చూస్తే టైమ్ వేస్ట్ చేస్తున్నట్టు కనిపించినా.. లోపల మాత్రం వాళ్లు తమతో తామే యుద్ధం చేస్తున్నారు.

కరోనా తర్వాత ఈ పరిస్థితి ఇంకా ఎక్కువైంది. ఒంటరితనం, ఆన్‌‌లైన్ జీవితం, మనుషుల మధ్య దూరం.. ఇవన్నీ యువత మనసులపై గాఢమైన ముద్ర వేశాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చోవడమే కష్టంగా మారింది. నోటిఫికేషన్లు, రీల్స్‌‌, మెసేజ్‌‌లు, అంచనాలు.. మెదడుకి విశ్రాంతి అనే మాటే లేకుండా పోయింది.అందుకే కొన్నిసార్లు వాళ్లు మంచం మీదే పడుకుని ఉంటారు. ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. చేయాల్సిన పనులు గుర్తొచ్చి భయపడతారు. మళ్లీ వాటి నుంచి తప్పించుకోవడానికి అదే ఫోన్‌‌లో మునిగిపోతారు. ఇది సోమరితనం కాదు.. మానసికంగా పూర్తిగా అలసిపోయిన స్థితి. 

ఎక్స్​పర్ట్స్ ఏమంటున్నారంటే.. “నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు” ప్రతి ఒక్కరూ కనిపించేంత స్ట్రాంగ్‌‌గా ఉండరు. కొందరు నిశ్శబ్దంగా ఒత్తిడిని భరిస్తుంటారు. అలాంటి సమయంలో జీవితాన్ని ఒక్కసారిగా సరిచేయాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులతో మొదలు పెట్టాలి. ఫోన్‌‌కి కొద్దిసేపు దూరంగా ఉండాలి. సరైన నిద్ర, నిజమైన మనుషులతో మాట్లాడటం, కొంచెం నడక.. ఇవే మెదడుకి మళ్లీ శక్తినిస్తాయి.