ఎన్నికల ఏరియాకే పైసల్

ఎన్నికల ఏరియాకే పైసల్
  • రెండు నెలల్లోనే రూ.10 కోట్లు రిలీజ్
  • విలీన గ్రామాలను మాత్రం పట్టించుకోని వైనం
  • సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జనాలు
  • కమలాపూర్ మండలానికి భారీగా నిధులు కేటాయించిన ‘కుడా’


హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాలను డెవలప్ చేసేందుకు ఏర్పాటు చేసిన కాకతీయ అర్బన్​ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దాని పరిధిలోకి వచ్చే కమలాపూర్ మండలంలోనే పనులు చేపడుతోంది. గ్రేటర్​ వరంగల్ లో విలీనమైన గ్రామాలకు గడిచిన రెండేండ్లలో పైసా కేటాయించని కుడా.. ఇప్పుడు కేవలం ఎలక్షన్​ ఉన్న ఏరియాలోనే ఖర్చు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏండ్లుగా విలీన గ్రామాల్లో సమస్యలు వెక్కిరిస్తున్నా... ఇక్కడి లీడర్లు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
పైసా పెడ్తతలేరు..
కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) హనుమకొండ, వరంగల్​, జనగామ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. వరంగల్​ తూర్పు, పశ్చిమ, పరకాల, స్టేషన్​ ఘన్​ పూర్​, వర్ధన్నపేట, హుజురాబాద్, హుస్నాబాద్​ నియోజకవర్గాలు కుడా పరిధిలోకి వస్తాయి. మొత్తంగా 19 మండలాలు, 181 గ్రామాలు దీని పరిధిలోనే ఉన్నాయి. కాగా లేఅవుట్ వెంచర్లు, కమర్షియల్​ కాంప్లెక్స్​, తదితర డెవలప్​ మెంట్​చార్జీలతో పాటు మా సిటీ, ఓ సిటీ, అపార్ట్ మెంట్స్​ద్వారా కుడాకు ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులతో సిటీలో జంక్షన్లు, స్ట్రీట్​ లైట్స్​, పార్కులు, కొన్నిచోట్ల రోడ్లు ఇలా మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ నగర పరిధిలోకి వచ్చే విలీన గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. రెండేండ్ల కింద స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వర్ధన్నపేట, స్టేషన్​ ఘన్​పూర్ మండలాలకు తలా రూ.20 కోట్లు, పరకాల నియోజకవర్గానికి రూ.12కోట్ల చొప్పున నిధులు కేటాయించిన పాలకవర్గం.. ఆ తరువాత పైసా కూడా ఇవ్వలేదు.
ఎన్నికలున్న చోటుకే నిధులు
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కమలాపూర్ మండలం కుడా పరిధిలోనే ఉంది. ఆ మండలంలో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఇక్కడి లీడర్లంతా ఆ మండలంపైనే పైసలు కుమ్మరించారు. ఎలక్షన్ కోడ్ కు ముందే హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పనుల్లో చాలా వరకు కుడా ఫండ్స్ నే వినియోగిస్తున్నారు. కేవలం రెండు నెలల్లో కమలాపూర్ మండలానికి ఏకంగా  రూ.10 కోట్లకు పైగా నిధులను సాంక్షన్ చేశారు. వివిధ కమ్యూనిటీ హాల్స్, రోడ్ల పనులతో పాటు కమలాపూర్​ మండల కేంద్రంలో రూ.1.25 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్ స్టాండ్ జంక్షన్​కు రూ.1.45 కోట్లు, కమలాపూర్​, ఉప్పల్​, అంబాల, గూడురు జంక్షన్లకు రూ.3.30 కోట్లు, కనపర్తి రోడ్డు నుంచి ఉప్పల్​ బై పాస్​ రోడ్డుకు రూ.కోటి, కమలాపూర్​లో గ్రీనరీ కోసం రూ.కోటి, గూడురు నుంచి వంగపెల్లి క్రాస్​ రోడ్డు వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.
విలీన గ్రామాలపై పట్టింపేది?
వరంగల్ సిటీ గ్రేటర్ గా అప్ గ్రేడ్ అయ్యే క్రమంలో చుట్టుపక్కల ఉన్న 42 గ్రామాలను సిటీలో విలీనం చేశారు. అవన్నీ కుడా పరిధిలో ఉన్నవే. గ్రేటర్ లో విలీనమైన తర్వాత ఆయా గ్రామాల్లో అభివృద్ధిని గాలికొదిలేశారు. హుజూరాబాద్​నియోజకవర్గంలో పలు మండలాలకు ఇన్​చార్జ్ లుగా ఉన్న ఇక్కడి లీడర్లు.. కుడా ఫండ్స్​ ను కేవలం కమలాపూర్​లో ఖర్చు చేస్తున్నారే తప్ప సిటీ, విలీన గ్రామాల డెవలప్​ మెంట్ ను పట్టించుకోవడం లేదు. కమలాపూర్​లో చెన్నూరు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కుడా నిధులతో కొన్ని పనులు చేస్తుండగా.. ఇక్కడి లీడర్లు మాత్రం నోరు విప్పడం లేదు. ఎన్నికలు ఉన్న చోటే నిధులు ఖర్చు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.