కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలి : బీజేపీ కార్పొరేటర్లు

కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలి  : బీజేపీ కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు: వానలతో  సిటీలో రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని బల్దియా కమిషనర్​ను బీజేపీ కార్పొరేటర్లు కోరారు. డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్నాయని, నాలాల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వివరించారు. ఎమ్మెల్యే ఫండ్ తరహాలో, కార్పొరేటర్ ఫండ్స్ ఇవ్వాలని కోరామన్నారు.  ప్రతి ఏడాది వర్షాకాలం సీజన్​కు ముందు కార్పొరేటర్లతో సమావేశమై  అభిప్రాయాలు సేకరించేవారని పేర్కొన్నారు. 

బుధవారం కమిషనర్​తో హెడ్డాఫీసులో బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్​తో పాటు పలువురు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. అనంతరం కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ నగరవాసులు ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదని, వెంటనే కౌన్సిల్ సమావేశాన్ని పెట్టాలని కోరినట్లు చెప్పారు. బీజేపీని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని, మేయర్​కు వినతిపత్రం ఇస్తే చెత్తబుట్టలో వేస్తారన్నారు. 

పేరుకే మేయర్ ఉన్నారని, పనులు మాత్రం చేయడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే పనులు చేయకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, ఆకుల శ్రీవాణి పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.