అభివృద్ధి కోసం ఇచ్చిన పైసలు దుర్వినియోగం చేసిన్రు

అభివృద్ధి కోసం ఇచ్చిన పైసలు దుర్వినియోగం చేసిన్రు
  • ఉచిత బియ్యం పంపిణీలో 85శాతం నిధులు కేంద్రానివే
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

శంషాబాద్. వెలుగు: కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి  అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం  లేదంటూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. నిధులు కేంద్రానివి అయితే గొప్పలు కేసీఆర్ వి అన్న చందంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అసమర్థ పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యం అన్నారు.

ఆదివారం శంషాబాద్ లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జోషి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కష్టకాలంలో దేశాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ దేశంగా తీర్చిదిద్దారన్నారు. కరోనా వ్యాక్సిన్ లు తయారు చేయడంతో పాటు డిఫెన్స్ లో 310 రకాల విదేశీ ఆయుధ సామగ్రి దిగుమతిని రద్దు చేసుకుని  సొంతంగా తయారు చేసుకునే దశకు చేరుకున్నామన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ దేశం సాధించిన విజయాల్లో చాలా గొప్పదని పేర్కొన్నారు. కరోనాతో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైతే మన దేశం నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీ చేసే రేషన్ దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు సమకూరుస్తుంటే, కేవలం 15 శాతం నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్ ఆయన ఫొటో పెట్టుకోవడం సమంజసం కాదన్నారు. రైల్వే, రోడ్లు, ఇరిగేషన్ వంటి రంగాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే, ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బూత్  స్థాయిలో బలపడాలని సూచించారు. కేసీఆర్ పరిపాలన అంతం కోసం ప్రతి కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలని జోషి  పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ చింతల నందకిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డె చంద్రయ్య , మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, బీజేపీ  మున్సిపల్ అధ్యక్షుడు కొనమొల్ల దేవేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి ముందు సిద్ధాంతి, బీజేపీ దళిత నాయకుడు చిన్నగండు నరేష్ ఇంట్లో ప్రహ్లాద్ జోషి భోజనం చేశారు.