మల్కాజిగిరి, వెలుగు: ఈసీఐఎల్ పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.41 లక్షలకు పైగా నిధులను కాజేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈసీఐఎల్సంస్థలోని పీఎఫ్ విభాగంలో పనిచేస్తున్న నిందితుడు రాజారపు ఓంకార్.. తొలుత ట్రస్ట్ చెక్‌బుక్ నుంచి నాలుగు చెక్కులను దొంగిలించాడు. అనంతరం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీ మోసానికి పాల్పడ్డాడు. మే 2న ఎస్బీఐ ఈసీఐఎల్ శాఖ, హెచ్డీఎఫ్సీ ఏఎస్‌రావునగర్ శాఖలలోని ఖాతాల నుంచి మూడు చెక్కుల ద్వారా నిధులను తనతో పాటు తన భార్య కాశీశ్వరి బ్యాంక్ ఖాతాల్లోకి అక్రమంగా బదిలీ చేసుకున్నాడు.
ఇందులో ఒక చెక్కు ద్వారా రూ. 16 లక్షలు, మిగిలిన రెండు చెక్కుల ద్వారా రూ. 12.50 లక్షల చొప్పున మొత్తం రూ. 41 లక్షలకు పైగా నగదును కాజేశాడు. మరో చెక్కును నగదుగా మార్చుకునే ప్రయత్నం చేయగా, సంతకం సరిపోలకపోవడంతో బ్యాంకు తిరస్కరించింది. ఈ విషయమై ఈసీఐఎల్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, జడ్జి14 రోజుల రిమాండ్ విధించారు.
