బడ్జెట్​ కేటాయించక ఆర్టీఏ పర్సు ఖాళీ!

బడ్జెట్​ కేటాయించక ఆర్టీఏ పర్సు ఖాళీ!
  • బడ్జెట్​ విడుదల చేయని ప్రభుత్వం
  • ఏడాదిగా సర్వీస్​ ప్రొవైడర్లకు అందని బిల్లులు
  • 2 నెలలుగా నిలిచిపోయిన ఆర్సీ, డ్రైవింగ్​ లైసెన్సుల జారీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన ఆర్టీఏని నిధుల కొరత వేధిస్తోంది. ఏడాది నుంచి సర్వీస్​ ప్రొవైడర్లు, ఏడాదిన్నర నుంచి అద్దె వాహనాల డ్రైవర్లకు బిల్లులు చెల్లించట్లేదు. ఆర్టీఏకి గత ఆర్థిక సంవత్సరంలో ₹4 వేల కోట్లదాకా ఆదాయం వచ్చింది. ఈసారి ₹100 కోట్ల వరకు బడ్జెట్​ ప్రతిపాదన పెట్టారు. ఇందులో ఇప్పటిదాకా వచ్చింది కేవలం కోటిన్నర. టైంకు నిధులు విడుదల కాకపోవడంతో చాలా పనులు పెండింగ్​లో పడుతున్నాయి. ఐటీ విభాగంలో పనిచేసే సర్వీస్​ ప్రొవైడర్ల సంస్థలకు డబ్బులు కట్టట్లేదు. శ్రీనాథ్​, సీఎంఎస్​, ఎంటెక్​, ఓరియంట్​, కోర్స్​ వంటి సంస్థలు సాఫ్ట్​వేర్​ సేవలు అందిస్తున్నాయి. రిజిస్ట్రేషన్​ ఆఫ్​ సర్టిఫికెట్​, డ్రైవింగ్​ లైసెన్సులు, కార్డుల ప్రింటింగ్​ తదితర పనులను అవి చూస్తున్నాయి. మూడు నెలలకోసారి ఆయా కంపెనీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కానీ, ఇప్పుడు ఏడాది అవుతున్నా డబ్బులు ఇవ్వలేదు. ₹25 కోట్ల దాకా ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. దీంతో రెండు నెలలుగా ఆర్సీ, డ్రైవింగ్​ లైసెన్సుల జారీ నిలిచిపోయింది.