ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం: జి.చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం: జి.చెన్నయ్య

సైఫాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల మాలలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ల వల్ల విద్య, ఉద్యోగాల్లో మాలలు నష్టపోతున్నారని, వెంటనే వాటిని సవరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సైఫాబాద్​లో మాల సంక్షేమ సంఘం, మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం వల్ల మాలలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. షామీమ్ అక్తర్ కమిషన్ మాలల జనాభాను తక్కువగా, మాదిగల జనాభాను ఎక్కువగా చూపించిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పందించని పక్షంలో న్యాయపోరాటంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హైకోర్టులో కేసులు వేశామని తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, డాక్టర్ మంచాల లింగస్వామి, డాక్టర్ నిమ్మ బాబూరావు, డాక్టర్ మంద రంజిత్ కుమార్, గోపోజు రమేశ్, దాసరి విశాల్, అంజలీ కుమారి పాల్గొన్నారు.