- ఆయన సేవలను భావితరానికి చేరేలా చూస్తం
- గద్దర్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి
- ప్రజలు చెక్కిన శిల్పమే గద్దర్: నారాయణ
- జనంలో చైతన్యం తెచ్చిన లీడర్: కోదండరాం
బషీర్‌బాగ్, వెలుగు: ప్రజాయుద్ధనౌక గద్దర్ సేవలు భావితరాలకు చేరేలా హైదరాబాద్‌లో గద్దర్ కల్చరల్ సెంటర్‌ను ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌గా ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గద్దర్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, సీపీఐ నాయకుడు నారాయణ, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఖాసీం, సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల, గద్దర్ కుమారుడు సూర్యం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. గద్దర్ తన ఆటపాటల ద్వారా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. సీపీఐ నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. ప్రజలు చెక్కిన శిల్పమే గద్దర్ అన్నారు.
గద్దర్ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చిందని, భవిష్యత్తు తరాలకు ఉద్యమ స్ఫూర్తినిచ్చే చరిత్రగా గద్దర్ నిలుస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ.. తమ లాంటి అనేక జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కల్చర్, రిసర్చ్ సెంటర్ల కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శాంత సిన్హా , జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
