మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి.. గద్దర్ : ఆర్.నారాయణమూర్తి

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి.. గద్దర్ : ఆర్.నారాయణమూర్తి
  • పాటల తూటాలతో ప్రభుత్వాల్లో కదలిక తెచ్చారు: ఆర్.నారాయణమూర్తి 

బషీర్​బాగ్, వెలుగు:  తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి గద్దర్ అని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. పాటల తూటాలతో ప్రభుత్వాల్లో కదలిక తెచ్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని కొనియాడారు. గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణమూర్తి హాజరై.. గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా చైతన్య ఉద్యమ నావ, వాగ్గేయకారుడు గద్దర్ అని  కీర్తించారు. గద్దర్ తన మాట, పాటలతో జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడ్డారని పేర్కొన్నారు. మార్క్స్ సిద్ధాంతం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మిళితం చేసి సమాజ మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ తొలి ఉద్యమకారుడని గుర్తుచేశారు.  

గద్దర్ పేరిట సినిమా అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం సముచితం అని అన్నారు. అవార్డులో గద్దర్ చిత్రం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా గాయకుడు జయరాజ్ మాట్లాడుతూ.. గద్దర్ వ్యక్తి కాదు ఉద్యమ శక్తి అని కొనియాడారు.

గద్దర్ ఫౌండేషన్ స్థాపకుడు క్రాంతి కిరణ్  సారథ్యంలో జరిగిన సభా కార్యక్రమంలో సాంస్కృతిక సారథి వెన్నెల, విమల గద్దర్, సుల్తాన్ యాదగిరి,  కవి నర్సిరెడ్డి,   సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, నరసింహా రావు పాల్గొని ప్రసంగించారు.