
- గద్వాల సంస్థానం కృష్ణరామ్ భూపాల్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ జోగుళాంబ ఆలయంలో ఈ నెల 23, 24న ‘గుడి సంబురాలు’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని గద్వాల సంస్థానానికి చెందిన కృష్ణ రామ్ భూపాల్ తెలిపారు. గద్వాల సంస్థానం చరిత్ర, వారసత్వాన్ని ఈ తరానికి తెలిపేందుకు , అక్కడి వారసత్వ సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆగస్టు 28న తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గద్వాల జోడు పంచలను సమర్పించామని తెలిపారు.
ఈ నెల 23, 24న నిర్వహించనున్న గుడి సంబురాలు ద్వారా గద్వాల సంస్థానం చారిత్రక ప్రాధాన్యతను యువతకు తెలియజేస్తామన్నారు. అలాగే ఈ ప్రాంతంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. గద్వాల జిల్లాను పర్యాటక కేంద్రంగా మరింత ప్రోత్సహించడానికి కూడా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.