హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు నిరూపించాలని, అలా చేయనిపక్షంలో నాలుక చీరేస్తానంటూ హెచ్చరించారు.
కేటీఆర్ అక్రమాస్తులను ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టడంతో.. మతిస్థిమితం కోల్పోయిన కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన చెంచాగాళ్లతో సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని, మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, ఉరికించి కొట్టడమే ఉంటుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
