- కక్ష్యలోకి ఇండియన్ స్టార్టప్ దృష్టి శాటిలైట్..
- స్పేస్ ఎక్స్ రాకెట్ సాయంతో రోదసిలోకి..
- ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం
న్యూఢిల్లీ: బెంగళూరులో ఉన్న స్పేస్ స్టార్టప్ ‘గెలాక్స్ఐ’ మిషన్ దృష్టి శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఈ ఉపగ్రహాన్ని ఆదివారం అంతరిక్షంలోకి పంపించారు. మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్. ఎలక్ట్రో ఆప్టికల్ (ఈఓ), సింథటిక్ ఆపర్చుర్ రాడార్ (సార్) సెన్సార్ లను సింగిల్ ఆపరేషన్ ప్లాట్ ఫాంగా ఆప్టోసార్ ఉపగ్రహం కలుపుతుందని గెలాక్స్ఐ కంపెనీ తెలిపింది.
భూమి మీద సూర్యకాంతి బాగా ఉన్నపుడు హై రిజల్యూషన్ ఇమేజెస్‌ను ఈఓ సెన్సార్లు క్యాప్చర్ చేస్తాయని, అలాగే వాతావరణం, ఆల్ టైం ఇమేజెస్‌ను సార్ సెన్సార్లు క్యాప్చర్ చేస్తాయని గెలాక్స్ఐ ఫౌండర్, సీఈఓ సుయాష్ సింగ్ వెల్లడించారు. మిషన్ దృష్టిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెటామని, ఇక తమ తదుపరి లక్ష్యం ఆ ఉపగ్రహాన్ని కమిషన్ చేయడమే అని ఆయన పేర్కొన్నారు.
విభిన్న, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా కచ్చితమైన, నమ్మకమైన డేటాను పొందడమే ఈ మిషన్ ఉద్దేశమని చెప్పారు. డిఫెన్స్, అగ్రికల్చర్, విపత్తు నిర్వహణ, సముద్రతీర ప్రాంత పర్యవేక్షణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ వంటి రంగాల్లో డ్యుయెల్ యూజ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా ఇది ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే, దేశ విస్తృత కార్యకలాపాలకు కూడా ఈ మిషన్ ఉపకరిస్తుందన్నారు.
అతికొద్ది మంది మాత్రమే ఆ ఘనత సాధించారు
మిషన్ దృష్టి ప్రయోగం సక్సెస్ కావడంపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ ఏకే భట్ హర్షం వ్యక్తం చేశారు. ఆప్టికల్, సార్ కేపబిలిటీస్‌ను ఒకే ప్లాట్‌ఫాంలోకి కలిపే సామర్థ్యం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉందని, దృష్టి శాటిలైట్‌తో మనకూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
