
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న తీర్పు వెలువరించిందని.. సీబీఐ స్వాధీనం చేసుకున్న 105 బంగారు నగలు, కార్లు తదితరాలను జప్తు చేయాలని ఆదేశించిందన్నారు.
ఓబుళాపురం కంపెనీకి మైనింగ్ లీజు మంజూరుకాకముందే పిటిషనర్, ఆయన భార్య బంగారాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. సీబీఐ కోర్టు జైలు శిక్షతోపాటు జప్తునకు ఆదేశించిందని, ఎందుకు జప్తు చేస్తున్నారన్నదానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదన్నారు. సీబీఐ కోర్టు జప్తు ఉత్తర్వులపై స్టే ఇవ్వకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కౌంటరు దాఖలు చేస్తామనగా న్యాయమూర్తి అనుమతిస్తూ ఈ నెల 23వ తేదీకి విచారణను వాయిదా వేశారు.