
జమ్ము కశ్మీర్ : డాక్టర్ అవుతా.. అమ్మకు తోడుంటా అంటున్నాడు ఓ కరుడుగట్టిన టెర్రరిస్ట్ అఫ్జల్ గురు కొడుకు. భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిపిన కేసులో 2001లో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడింది. అప్పటినుంచి అతడి కొడుకు గాలిబ్ గురు.. కశ్మీర్ లో తన తల్లి తబుస్సమ్, తాత గులాబ్ మహమ్మద్ సంరక్షణలో పెరిగాడు. చదువులో మంచి ప్రతిభ చూపిస్తున్నాడు గాలిబ్ గురు. జమ్ముకశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో 88శాతం మార్కులు తెచ్చుకున్నాడు. తాను ఓ డాక్టర్ కావాలనుకుంటున్నానీ… అందుకు పాస్ పోర్ట్ కావాలని కోరుతున్నాడు గాలిబ్ గురు.
అప్జల్ గురు కూడా డాక్టర్ కావాలనుకున్నాడు. కానీ… ఉగ్రవాదంపట్ల ఆకర్షితుడై.. షేర్ ఎ కశ్మీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి డాక్టర్ పట్టా పొందలేకపోయాడు. డాక్టర్ కావాలనుకున్న తన తండ్రి ఆశయాన్ని తాను సాధిస్తా అంటున్నాడు అఫ్జల్ గురు కొడుకు గాలిబ్. మే 5న జరగనున్న నీట్ ఎగ్జామ్ కు ప్రిపేరవుతున్నాడు.
“గతంలో జరిగిన తప్పులనుంచి మా కుటుంబం ఎంతో నేర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలు, వేర్పాటువాదుల ఒత్తిళ్లను తట్టుకుని.. వాటికి దూరంగా మా అమ్మ, తాత నన్ను చదివిస్తున్నారు. వాళ్ల కోసమైనా నేను డాక్టర్ కావాలనుకుంటున్నా. నీట్ పరీక్ష రాసి ఇండియాలో సీట్ సాధించలేకపోతే… విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు వీలుగా నాకు పాస్ట్ పోర్ట్ అవసరం ఉంటుంది. అందుకే.. పాస్ పోర్ట్ కోసం అప్లై చేస్తున్నా. పాస్ పోర్టు ఉంటే ఇంటర్నేషనల్ మెడికల్ స్కాలర్ షిప్ నాకు సహాయపడుతుంది. ప్రభుత్వాలు నాకు సాయం చేయాలని కోరుతున్నా” అన్నాడు గాలిబ్.
కశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదం లాంటి అంశాలకు గాలిబ్ కుటుంబం దూరంగా ఉంటూ వస్తోంది. గాలిబ్ గురును బాగా చదివించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పింది అతడి తల్లి. తనను డాక్టర్ గా చూడాలని… తన కుటుంబం పట్ల సమాజానికి ఉన్న దృక్పథం మారాలని… తన తల్లి ఎంతో కష్టపడుతోందని తమను సంప్రదించిన మీడియా ప్రతినిధులతో చెప్పాడు గాలిబ్. ఉగ్రవాది కొడుకు అన్న సంగతి మరిచిపో.. నీ లక్ష్యం వైపు నిజాయితీగా నడిచి పేరు తెచ్చుకో అని గాలిబ్ ను ప్రోత్సహిస్తున్నారు ఆయన సంబంధీకులు.