హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా హెడ్ ఆఫీసులో గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వివాదానికి 15 ఏండ్ల తర్వాత తెరపడింది. అప్పట్లో కాంగ్రెస్ మేయర్ బండ కార్తీకరెడ్డి టైమ్లో మేయర్ గేటు ముందు వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. దీన్ని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. ఒక్క విగ్రహం పెడితే విమర్శిస్తున్నారని, ఆ రాత్రికి రాత్రే వైఎస్ఆర్ విగ్రహానికి రెండువైపులా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను పెట్టారు.
వివాదం పెద్దది కావడంతో అప్పటి నుంచి విగ్రహాలు ఆవిష్కరణకు నోచుకోలేదు. దీంతో వాటిని అక్కడి నుంచి తొలగించి ఒక్కో చోట ఒక్కో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల స్టాడింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే, విగ్రహాలను తొలగించిన స్థానంలో ఫౌంటెయిన్ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని మేయర్ గేటు ముందు, అంబేద్కర్ విగ్రహాన్ని కమిషనర్ గేటు ఎదుట పెట్టారు. ఈ విగ్రహాలను గురువారం గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి ప్రారంభించనున్నారని బల్దియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
