పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్డాక్టర్లు అరుదైన శ్వాసనాళ ఆపరేషన్చేసి, నిరుపేద యువకుడికి ప్రాణాలు కాపాడారు. భూపాలపల్లికి చెందిన 20 ఏళ్ల సందీప్ 2018లో పురుగుల మందు తాగడంతో శ్వాసనాళ సమస్య తలెత్తింది. కుటుంబసభ్యులు పలు దవాఖానల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాకపోగా, శ్వాసనాళం 95 శాతం వరకు మూసుకుపోయింది.
కార్పొరేట్ హాస్పిటళ్లలో రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక గాంధీ దవాఖానలో చేర్పించారు. ఇక్కడి కార్డియోథొరాసిక్ సర్జన్లు రవీంద్ర, పద్మలత, రాజశేఖర్, ఈఎన్టీ నిపుణులు నాగరాజు, రాంజీ, అనస్థీషియా డాక్టర్లు మురళీధర్, సుచరిత గత నెల 30న అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ను సక్సెస్చేశారు. సుమారు 4 సెంటీమీటర్ల మేర మూసుకుపోయిన శ్వాసనాళ భాగాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని పునరుద్ధరించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న సందీప్ను శనివారం డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వైద్యులను అభినందించారు.
