సమ్మె బాటలో ‘గాంధీ’ సిబ్బంది

సమ్మె బాటలో  ‘గాంధీ’ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: కరోనా నోడల్​ సెంటర్​గా ఉన్న గాంధీ హాస్పిటల్​లో మంగళవారం అన్ని డిపార్ట్​మెంట్ల సిబ్బంది రోడ్డెక్కారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్టు స్టాఫ్​ ఒక రోజు సమ్మెకు దిగారు.  వందలాది మంది  విధులు బహిష్కరించడంతో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న కరోనా పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. పదేండ్ల క్రితం రూ.1,500 జీతంతో చేరిన తమకు ఇప్పుడు కేవలం రూ.8,500 జీతమే వస్తోందని, ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని, జీతాలు పెంచడమే కాక తమను రెగ్యులరైజ్​ చేయాలని సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్, పేషెంట్​ కేర్ సిబ్బంది, వార్డు బాయ్స్, ఆయాలు డిమాండ్​ చేశారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించిన దాదాపు 500 మంది సిబ్బంది.. ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు.   ధర్నా విరమించాలని పోలీసులు కోరినా సిబ్బంది అంగీకరించలేదు.  సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్​ వెంటనే స్పందించాలని డిమాండ్​ చేశారు.

డిమాండ్స్​ ఇవీ..

జీతాలను రూ.25 వేల వరకు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్​ చేయాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ నేరుగా ప్రభుత్వమే జీతాలివ్వాలి. పీఎఫ్ జమలో ఉన్న అవకతవకలను సరిచేయాలి. సీఎం ప్రకటించిన 10 శాతం కరోనా ఇన్సెంటివ్​లు ఇవ్వాలి. వారం రోజులు వరుసగా డ్యూటీ చేసిన సిబ్బందికి వారం సెలవు ఇవ్వాలి. సిబ్బందిపై పనిభారం పెరిగిన కారణంగా ఖాళీగా ఉన్న చోట్ల కొత్త వారిని నియమించాలి. కరోనా వార్డుల్లో డ్యూటీలు చేస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్​లు, శానిటైజర్స్​ ఇవ్వాలి.

ఇవాళ కొనసాగనున్న గాంధీ సిబ్బంది సమ్మె

ఒకరోజు సమ్మెకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కొనసాగించాలని గాంధీ ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్​ సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది.  బుధవారం కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని గాంధీ సిబ్బంది తరఫున ఆయా కార్మిక సంఘాల నేతలు కలసి వారి సమస్యలను వివరించనున్నారు.

ఇదేనా ప్రతిఫలం?

కరోనా వార్డుల్లో రిస్క్ తో ​పని చేస్తున్న ఔట్ ​సోర్సింగ్, కాంట్రాక్ట్​ సిబ్బందికి అతి తక్కువ జీతాలివ్వడం సరికాదని గాంధీ ఆస్పత్రి సీఐటీయూ నేత లక్ష్మీపతి అన్నారు. కొత్త సెక్రటేరియట్​ నిర్మాణంపై సర్కార్​కు ఉన్న శ్రద్ధలో కొంతైనా గాంధీ సిబ్బందిపై పెట్టాలని సీఎంను కోరారు. ఇంట్లో వద్దని చెబుతున్నా ప్రాణాలను పణంగా పెట్టి రోజు డ్యూటీలు చేస్తున్నామని, రూ.8,500 జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని గాంధీ శానిటేషన్​ వర్కర్​ లక్ష్మీ ప్రశ్నించింది.

ఐదో రోజుకు ఔట్​ సోర్సింగ్​ నర్సుల సమ్మె

చాలీచాలని జీతాలతో బతుకులు ఈడ్చుకొస్తున్నామని, ఇప్పటికైనా తమపై దయతలచాలని గాంధీ ఆస్పత్రి ఔట్​ సోర్సింగ్​ నర్సులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ జీతాలను రూ.35 వేలకు పెంచాలని, జాబ్స్​ను రెగ్యులరైజ్​ చేయాలంటూ వారు చేపటట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరింది.

మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి

గాంధీ ఆస్పత్రిలో కొన్నేండ్లుగా తక్కువ జీతాలతో, అభద్రతాభావంతో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని ఔట్​సోర్సింగ్​ పారామెడికల్​ సిబ్బంది మంగళవారం గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజారావుకు వినతిపత్రం ఇచ్చారు. గాంధీలో 42 మంది పారా మెడికల్, 35 మంది కంప్యూటర్​ ఆపరేటర్స్​ ఔట్​సోర్సింగ్ కింద పనిచేస్తున్నారన్నారు. కరోనా టైంలో చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు.  ఔట్​సోర్సింగ్​ సిబ్బందిని పర్మినెంట్​ చేయాలని, జీతం రూ.30 వేలకు పెంచాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి ఈటలకు లేఖలు పంపారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడిగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

కరోనాపై సర్కార్ కాడేత్తేసింది..