టెల్ అవీవ్​పై మిస్సైల్ ప్రయోగించాం : హమాస్

టెల్ అవీవ్​పై మిస్సైల్ ప్రయోగించాం : హమాస్

జెరూసలేం: టెల్ అవీవ్​పై మిస్సైల్ దాడులను ప్రారంభించామని ఆదివారం హమాస్ తెలిపింది. తన టెలిగ్రామ్ చానల్​​లో తెలిపింది. పౌరులపై జరిపిన మారణకాండకు ప్రతిస్పందనగా గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లను ప్రయోగించామని చెప్పింది. హమాస్ దాడులకు దీటుగా బదులిచ్చామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అనేక రాకెట్లను అడ్డుకున్నామని పేర్కొంది.  8 రాకెట్లు రఫా ప్రాంతం నుంచి దాటుతుండగా గుర్తించామని చెప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వివరించింది. 

హమాస్ వరుసగా రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటమార్ బెన్ జివిర్ స్పందించారు. రఫాపై పూర్తి శక్తితో దాడులు జరుపుతామని ట్వీట్ చేశారు. మరోవైపు, యుద్ధాన్ని ఆపాలని, గాజాలో బందీలుగా ఉన్న 100 మందిని విడుదల చేయడానికి చేసిన ప్రయత్నాలు అనేక వారాలు నిలిచిపోయాయి. కానీ, ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాని మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. 

త్వరలో ఇజ్రాయెల్ కు సర్​ప్రైజ్: హిజ్బొల్లా 

ఇజ్రాయెల్​కు త్వరలో సర్​ప్రైజ్ ఇస్తామని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తెలిపింది. గాజాపై యుద్ధానికి దిగడం ద్వారా తన లక్ష్యాలను ఏది ఇజ్రాయెల్ సాధించలేదని హిజ్బొల్లా కమాండర్ హసన్ నస్రల్లా హెచ్చరించారు. యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించడం  ఇజ్రాయెల్ కు భారీ నష్టమని పేర్కొన్నారు.