- అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేటలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ జీవోలు సృష్టించిన కేసులో ఆంధ్రప్రదేశ్ వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తమిళనాడులోని కాంచిపురంలో ఆయనను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారు. ఈ భూమిని కోర్టు తమకే కేటాయించినట్లు తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు.
ఆ భూమిని కొనుగోలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్‌లతో నిందితులు ఒప్పందం చేసుకున్నారు. దీనిపై గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కుట్రలో ఇప్పటికే నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. బ్రహ్మనాయుడి సోదరుడు రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు
ఈ భూకుంభకోణంలో రూ.12 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, రాధాకృష్ణకు రూ. 4 కోట్లు, మిగిలిన వారికి మరో రూ. 4 కోట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
కేసు తీవ్రతను పరిశీలించిన హైకోర్టు.. బ్రహ్మనాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటీవలే తిరస్కరించింది. దాంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని కాంచిపురంలో పట్టుకున్నారు.
శనివారం ఉదయం బ్రహ్మనాయుడిని కోర్టులో హాజరుపరుస్తామని శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆ తర్వాత అతడిని పోలీస్ కస్టడీకి తీసుకుని నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల సంతకాల దుర్వినియోగం, కుట్రలో భాగస్వాములైన ఇతరుల వివరాలపై సమగ్రంగా విచారిస్తామనిపేర్కొన్నారు.
