
హైదరాబాద్: 2025, ఆగస్ట్ 27వ తేదీ నుంచి దేశంలో వినాయక చవితి ఉత్సవాలు మొదలు కానున్నాయి. వినాయక చవితి వేడుకలకు తెలంగాణతో పాటు యావత్ దేశం ముస్తాబవుతోంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఆగస్ట్ 27వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులు, ఆఫీసులు అన్నీ ఎల్లుండి ( 2025, ఆగస్ట్ 27) బంద్ కానున్నాయి. మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అప్పుడే వినాయక చవితి హడావిడి మొదలైపోయింది. గల్లీ గల్లీలో వినాయకుడి కోసం మండపాలు ఏర్పాటు చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. గణనాథుడి విగ్రహాలను మండపాలకు తరలిస్తుండటంతో సందడి నెలకొంది.
మరోవైపు తెలంగాణలో గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా మాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. పీవోపీ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణానికి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నిమజ్జన చివరి రోజున రద్దీని తగ్గించేందుకు మూడు లేదా 5, 7రోజున నిమజ్జనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఫిట్ నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నిమజ్జనానికి ఉపయోగించాలన్నారు. ముందస్తు అనుమతులతో మాత్రమే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, డీజేలకు అనుమతి లేదన్నారు.
మతపరమైన ప్రదేశాల వద్ద జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉంచకూడదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లు నిషేధమని స్పష్టం చేశారు. విరాళాలు స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలన్నారు. అలాగే మండలాల వద్ద మద్యం సేవించడం, జూదం వంటి ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 10వ రోజు నిమజ్జనంతో పాటు మిలాద్-ఉన్ -నబీ ఉండడంతో శాంతిభద్రతలపై పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.