వినాయక నవరాత్రి వేడుకలకు.. భారత స్వాతంత్ర్య పోరాటానికి విడదీయలేని బంధం ఉంది. ఇళ్లలోనే జరుపుకునే పండగను వీధుల్లోకి తెచ్చి.. ప్రజలను ఏకం చేసిన ఘనత జాతీయోధ్యమ నేత బాల గంగాధర్ తిలక్ ది. విభజించు పాలించు సూత్రంతో దేశ ప్రజలను హిందువులు, ముస్లింలు, వారిలోనే కులాలు, వర్గాలుగా విడదీశారు బ్రిటీషర్లు. దీనికి విరుగుడుగా... సార్వ జనిక్ గణేష్ ఉత్సవ్ ప్రారంభించారు బాల గంగాధర్ తిలక్. 1890 నాటికి స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలక నేతగా ఎదిగారాయన. ప్రజలు మతాలు, కులాలు, వర్గాలుగా విడిపోవడాన్ని గమనించిన తిలక్.. వినాయక చవితి వేడుకల ద్వారా వారందరినీ ఏకం చేయడం మొదలు పెట్టారు.
1894 లో మొదటిసారి మహారాష్ట్రలోని పుణేలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ ప్రారంభించారు. వీధి మండపాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి... నవరాత్రులు నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాతే నిమజ్జనం చేసే సంప్రదాయం కూడా మొదలైంది. వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల ద్వారా అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఏకం అయ్యారు. భజన కీర్తనలతో పాటు... స్వాతంత్ర్య ఉద్యమ పాటలు, జాతీయోధ్యమ నాయకుల ప్రసంగాలు... ప్రజలను స్వాతంత్ర్య పోరాటం వైపు చైతన్యవంతులను చేశాయి. 1895 లో ఉత్సవాలు ముంబయిలోనూ మొదలయ్యాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించాయి. వందల మంది ఒకే చోట గుమిగూడడం... చర్చలు... స్వాతంత్ర్య పోరాటం వైపు మళ్లడం జరిగింది. ముస్లింలు కూడా హిందువులకు సహకారం అందించడంతో... ఉద్యమం ఉధృతమైంది. 1908 లో బాల గంగాధర్ తిలక్ ను రెండోసారి జైళ్లో వేశారు బ్రిటీషర్లు. అప్పటికే దేశమంతటా పాకి వినాయక నవరాత్రుల సంప్రదాయం... ప్రజల్లో ఐకమత్యాన్ని విస్తరించింది.
