ఓరుగల్లులో వైభవంగా గణపతి నవరాత్రులు

ఓరుగల్లులో వైభవంగా గణపతి నవరాత్రులు
  • రూ.కోటి 43 లక్షల 16 వేల విలువైన కరెన్సీ నోట్లతో మండపం అలంకరణ

ఓరుగల్లులో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న వినాయకులను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వినాయక మండపాలను ఒక్కో చోట ఒక్కో తరహాలో తీర్చిదిద్దారు. శివనగర్ లోని వాసవికాలనీలో వినాయక మండపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఒక్క రూపాయి నుంచి రెండు వేల వరకు మొత్తం నోట్లతో  డెకరేషన్ చేశారు. ఇందుకోసం కోటి 43 లక్షల 16 వేలు విలువైన కరెన్సీని ఉపయోగించారు. స్థానికుల నుంచి సేకరించిన ఈ డబ్బును పూజలు చేసిన తర్వాత మళ్లీ వారికే అందించనున్నారు. కరెన్సీతో సుందరంగా అలకంరించిన వినాయక మండపాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

విద్యుత్ దీపాల కాంతులతో వినాయక మండపాలు

కాలనీల్లోని వినాక మండపాలు విద్యుత్ దీపాల కాంతులతో ధగధగ మెరుస్తున్నాయి. రంగురంగుల విద్యుత్ లైట్లతో రోడ్లు పరిసర ప్రాంతాలు సుందరంగా తీర్చిదిద్దారు.  రాత్రి సమయంలో విద్యుత్ దీపాల మెరుపుల్లో బొజ్జ గణపయ్యలను చూస్తూ భక్తులు పరవశించిపోతున్నారు. ఒకచోట దేవతలు, రాక్షసులు పాసముద్రం చిలికి అమృతం తీస్తున్న దృశ్యాలు.. మరోచోట  వినాయకుడి చుట్టూ దేవతలు కొలువు దీరినట్లు ఇలా  అనేక విధాలుగా మండపాలను ఏర్పాటు చేశారు. కరోనా వల్ల రెండేళ్లు తీవ్రంగా ఇబ్బందిపడిన జనం ఈసారి కొత్త తరహాలో  గణపతి విగ్రహాలను ప్రతిష్టించి, పూజలు చేస్తున్నారు.