గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. ఎన్నడూ లేని విధంగా ఈసారి మూడు రోజులు ఆలస్యం

గణేశ్ నిమజ్జనాలు పూర్తి..  ఎన్నడూ లేని విధంగా ఈసారి  మూడు రోజులు ఆలస్యం
  •  హుస్సేన్ సాగర్ లో 300 విగ్రహాల నిమజ్జనం 
  •  వాహనాలు దొరక్క ఆలస్యం
  •  ఎన్నడూ లేని విధంగా ఈసారి  మూడు రోజులు ఆలస్యం 
  •  ఆదివారం ఒక్కరోజే 2500 టన్నుల వ్యర్థాల ​తొలగింపు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో గణేశ్‌ నిమజ్జనాలు పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూడు రోజులు ఆలస్యమైంది. ఏటా నిమజ్జనం తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కార్యక్రమం పూర్తయ్యేది. కానీ ఈ సారి ప్రధాన ఘట్టం శుక్రవారం పూర్తయినప్పటికీ, శనివారం రాత్రంగా నిమజ్జనం జరిగింది. అలాగే ఆదివారం  (సెప్టెంబర్ 27)   కూడా మధ్యాహ్నం వరకు కొన్ని విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి.

టస్కర్లు అందుబాటులో లేకపోవడంతో కొన్ని మండపాల నిర్వాహకులు విగ్రహాలను ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా వద్దకు తరలించి నిమజ్జనం చేశారు. ఆదివారం కూడా విగ్రహాలు రావడంతో పీపుల్స్‌ ప్లాజా, ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద 10 క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనం చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆదివారం 300 వరకు విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలను అనుమతించలేదు.  

హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల తొలగింపు షురూ  ..

హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని ఇతర చెరువులు, నిమజ్జన ప్రాంతాల్లోనూ విగ్రహాల డెబ్రిస్‌, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను సిబ్బంది తొలగిస్తున్నారు. హుస్సేన్ సాగర్​లో విగ్రహాల డెబ్రిస్​ వెలికి తీసి లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు పంపుతున్నారు. ఆదివారం ఒక్కరోజులోనే 2,500 మెట్రిక్ టన్నులను తొలగించారు. శుక్రవారం కంటే ముందు ఒక్క పీపుల్స్ ప్లాజా వైపే1500 టన్నులు తీశారు. ఇంకా వ్యర్థాల ​తొలగింపు కొనసాగుతోందని, సాగర్​లో మరో 7 వేల మెట్రిక్ టన్నులు  వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడ్రోజుల్లో క్లీన్ చేస్తామని ముందుగా చెప్పినప్పటికీ నిమజ్జనం ఆలస్యం కావడంతో మరో రెండురోజులు పడుతుందని అంటున్నారు. 

మూడు కార్పొరేషన్లలో 3.10 లక్షలు..

మూడు కార్పొరేషన్లలో చిన్నా, పెద్దా విగ్రహాలు కలిపి సుమారు 3.10 లక్షల గణేశ్​ విగ్రహాలు నిమజ్జనం కాగా, ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 66 వేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ లో గతేడాదితో పోలిస్తే ఈసారి నిమజ్జనమైన విగ్రహాల సంఖ్య సుమారు 10 శాతం పెరిగింది.