రాచకొండలో ప్రశాంతంగా శోభాయాత్ర

రాచకొండలో ప్రశాంతంగా శోభాయాత్ర

సికింద్రాబాద్, వెలుగు:  గణనాథుల శోభాయాత్ర రాచకొండ పరిధి​లో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నెమ్మదిగా సాగగా.. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి వేగం పెరిగి​ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ట్రాఫిక్​ కంట్రోల్​కు పోలీసులు ప్యారడైజ్​వద్ద వన్ వే ఏర్పాటు చేశారు. ప్యాట్నీ సెంటర్​, సీటీసీ రోడ్లను మూసివేశారు. ట్యాంక్​బండ్​ నుంచి సికింద్రాబాద్​వైపు వచ్చే వాహనాలను ఒక వైపు నుంచి అనుమతించారు. మల్కాజిగిరి సఫిల్​గూడ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణనాథుల నిమజ్జనం రాత్రి 7గంటల తర్వాత మొదలైంది. సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​లోనూ విగ్రహాల నిమజ్జనం కొలాహలంగా సాగింది.

జేబీఎస్​కు వెళ్లే బస్సులు దారి మళ్లింపు.. 

జిల్లాల నుంచి ట్యాంక్​బండ్​మీదుగా ఎంజీబీఎస్​కు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. కరీంనగర్​ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్​వైఎంసీఏ, సంగీత్​ క్రాస్​రోడ్స్, తార్నాక, జామై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్​ ఘాట్ ​మీదుగా వెళ్లాయి. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్​ క్రాస్​రోడ్స్, చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఐఎస్​సదన్, నల్గొండ క్రాస్​రోడ్స్, చాదర్​ఘాట్​మీదుగా నడిపారు. ముంబై వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రేజ్​ వై జంక్షన్​, నర్సాపూర్ క్రాస్​రోడ్స్​, బోయిన్​పల్లి, జేబీఎస్​, సంగీత్​ క్రాస్​ రోడ్స్​, తార్నాక, జామై ఉస్మానియా మీదుగా మళ్లించారు.     శుక్రవారం ఉదయం 8 గంటల వరకు డైవర్షన్ ఉంటుందని, ఆ తర్వాత పాత రూట్లలోనే బస్సులు నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది.