ఫిమేల్ లీడ్‌గా చేస్తూనే, కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలతోనూ మెప్పిస్తోంది వరలక్ష్మీ శరత్‌కుమార్. సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ‘మిస్టర్ సెలెబ్రిటీ’ సినిమాలో వరలక్ష్మీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. శనివారం వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలోని గణేష్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘గజానన.. గజానన.. గజ్జెల చప్పుడు గజానన..’ అంటూ సాగే పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘విధిరాతను ఎదురించినోడు లేడు.. ప్రకృతిని చెడగొట్టి బ్రతకలేడు.. నీవైపు నావైపు చూస్తున్నాడు..
కంటిచూపుతో పరిపాలించేటోడు.. ఈ పోరాటంలో గెలిచేది ఎవరు...చిత్రాలు చేసేటి శివుడే వాడు..’ అంటూ గణేష్ డివోషనల్ లిరిక్స్ రాయగా, మంగ్లీ పాడింది. వినోద్ యాజమాన్య సాంగ్ కంపోజ్ చేశాడు. చందిన రవి కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చిన్న రెడ్డయ్య, ఎన్ పాండురంగారావు నిర్మిస్తున్నారు. శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.