
కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలా పేట్ లో కేటుగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారనే సమచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ముఠా స్థావరాలపై దాడులు చేశారు. అల్లం, వెల్లుల్లి తయారీలో వాల్ పెయింటింగ్స్ లో వాడే కెమికల్స్ కలిపి జింజర్ గార్లిక్ వాడుతున్నారని గుర్తించారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలువ ఉండటానికి హానికారక టైటనీయం డయా క్సైడ్, జాంతం గమ్ వాడుతున్నారని గుర్తించారు. ఈ తనిఖీల్లో 1300ల కేజీల అల్లం, వెల్లుల్లి పేస్ట్, 20 కేజీల టైటానీయం డయా క్సైడ్, జాంతం గమ్ ని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్, కెమికల్స్ విలువ రూ. 1 లక్ష 70వేలు ఉంటుందని అంచనా వేశారు. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం నిర్వాహకుడు నీలా వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి.. కంపెనీ సీజ్ చేశామన్నారు. నిందితుడిపై గతంలో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు గుర్తించారు.