డెడ్‌‌‌‌డ్రాప్‌‌‌‌ పద్ధతిలో డ్రగ్స్‌‌‌‌ దందా.. వాట్సప్‌‌‌‌ ద్వారా ఆర్డర్లు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నగదు లావాదేవీలు

డెడ్‌‌‌‌డ్రాప్‌‌‌‌ పద్ధతిలో డ్రగ్స్‌‌‌‌ దందా.. వాట్సప్‌‌‌‌ ద్వారా ఆర్డర్లు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నగదు లావాదేవీలు
  •     32 గ్రాముల కొకైన్‌‌‌‌ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్‌‌‌‌

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌‌‌‌లో ‘డెడ్‌‌‌‌డ్రాప్‌‌‌‌’ పద్ధతిలో డ్రగ్స్‌‌‌‌ విక్రయం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఈగల్‌‌‌‌ టీం పట్టుకుంది. వైఫై ద్వారా వాట్సప్‌‌‌‌లో ఆర్డర్లు స్వీకరించి, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో డబ్బులు తీసుకుని, నిర్దిష్ట ప్రదేశాల్లో డ్రగ్స్‌‌‌‌ ఉంచి లొకేషన్‌‌‌‌ పంపే విధానాన్ని నిందితులు అనుసరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్‌‌‌‌ దందాకు పాల్పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వాసి మురళి కృష్ణంరాజు(24)తో పాటు అతడికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ, రుద్రరాజు హేమంత్‌‌‌‌రాజులను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. వారి వద్ద రూ.40 లక్షల విలువైన 32 గ్రాముల కొకైన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌‌‌‌ పరీక్షల్లో ముగ్గురికీ పాజిటివ్‌‌‌‌ రావడంతో గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులతో బీటెక్‌‌‌‌ను మధ్యలోనే మానేసిన కృష్ణంరాజు చెడు అలవాట్లకు బానిసై డ్రగ్స్‌‌‌‌ వ్యాపారంలోకి దిగాడు. మొదట మణికొండలో డ్రగ్‌‌‌‌ పెడ్లర్‌‌‌‌ నుంచి కొనుగోలు చేసిన కొకైన్‌‌‌‌ను విక్రయించగా, ఆ వ్యక్తి అరెస్ట్‌‌‌‌ కావడంతో గోవా, బెంగళూరు మార్గంగా సరఫరా కొనసాగించాడు.

కస్టమర్ల నుంచి బెంగళూరులోని స్నేహితుడి అకౌంట్‌‌‌‌కు డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయించి, డ్రగ్స్‌‌‌‌ను ఒకచోట ఉంచి లొకేషన్‌‌‌‌ పంపే ‘డెడ్‌‌‌‌డ్రాప్‌‌‌‌’ విధానాన్ని అమలు చేశాడు. బెంగళూరు నుంచి ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ బస్సుల ద్వారా డ్రగ్స్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌కు తెప్పించేవాడు. కొండాపూర్‌‌‌‌లోని వెంకటరమణ రెసిడెన్సీలో డ్రగ్స్‌‌‌‌ విక్రయం జరుగుతోందన్న సమాచారం మేరకు ఈగల్‌‌‌‌ టీం, గచ్చిబౌలి పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ కేసులో మరో 15 మందిని గుర్తించడంతో పాటు, డ్రగ్స్‌‌‌‌ రవాణాకు సహకరించిన బస్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌, ర్యాపిడో డ్రైవర్‌‌‌‌పై కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.