ఈటల కొత్త పార్టీపై గంగుల స్పందన

ఈటల కొత్త పార్టీపై గంగుల స్పందన

కరీంనగర్: కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీకి పుట్టగతులుండవన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు గంగుల. TRS పార్టీ ఉన్నంతకాలం వేరే పార్టీని ప్రజలు రిసీవ్ చేసుకోరన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడని..మా పార్టీకి, మా అధినేతకు ప్రత్నామ్నాయం లేదు.. రాదు.. రాబోదన్నారు. మండుటెండల్లో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్న గంగుల.. రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. సంతోషంగా ఉన్న ప్రజలు… కోరి కష్టాలు తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. మా పార్టీలో ధిక్కార స్వరం ఉండదన్న ఆయన.. వారు చెప్పిందే మాకు వేదవాక్కు అన్నారు.

కేసీఆర్ తో జరిగిన సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యల గురించి పత్రికలు ఇష్టానుసారంగా రాశాయని.. కొనుగోలు అనేది ఎఫ్.సీ.ఐ.చేతిలో ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టాలా లేదా అనేది ఎఫ్.సీ.ఐ. నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన పంటను దేశంలోని మిగతా రాష్ట్రాలకు అందాలంటే ఎఫ్.సి.ఐ కొనాలని తెలిపారు. పీడీఎస్ రైస్ కింద 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోతుందని.. మిగతా ధాన్యం విషయంలో ఎఫ్.సీ.ఐ. స్పష్టత ఇస్తే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటామన్నారు.